- యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ డిమాండ్
- గాజాలో మానవతా సంక్షోభం తీవ్రమవుతోందని ఆందోళన
జెనీవా: ఇరాన్‌లోని మినాబ్ నగరంలో బాలికల పాఠశాలపై ఇటీవల యూఎస్, ఇజ్రాయెల్ కలిసి జరిపిన దాడిలో 160 మందికి పైగా విద్యార్థినులు చనిపోవడంపై యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యుద్ధం ముసుగులో విద్యాసంస్థలపై దాడులేంటని నిలదీసింది. ఘటనను ఖండిస్తున్నామని..దీనిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేసింది. స్కూల్ పై దాడి చేసిన దళాలే నిష్పక్షపాతంగా, సమగ్రంగా దర్యాప్తు చేసి పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని స్పష్టం చేసింది. మంగళవారం యూఎన్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధి రవినా శామ్‌దాసాని మీడియాతో మాట్లాడారు.
"స్కూల్ పై జరిగిన దాడిలో అమాయకులైన చిన్నారులు చనిపోవడంపై యూఎన్ హ్యూమన్ రైట్స్ హైకమిషనర్ వోల్కర్ టర్క్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై నిష్పక్షపాత విచారణకు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ యుద్ధంలో క్రూరత్వాన్ని, విధ్వంసాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇది అత్యంత భయాందోళన కలిగించింది" అని వివరించారు.
అయితే, ఈ ఘటన యుద్ధ నేరం కిందకు వస్తుందో లేదో నిర్ధారించడానికి తమ వద్ద ప్రస్తుతానికి తగినంత సమాచారం లేదని ఆమె పేర్కొన్నారు.యూఎన్ ఎడ్యుకేషన్ ఏజెన్సీ యూనెస్కో కూడా ఈ దాడిని ఖండించింది. విద్యా సంస్థలపై దాడులు యుద్ధ నేరమేనని పేర్కొంది.
గాజాలో మానవతా సంక్షోభం తీవ్రం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో మానవతా సంక్షోభం మరింత పెరుగుతున్నదని యునైటెడ్ నేషన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా కారణాల రీత్యా గాజా సరిహద్దులను ఇజ్రాయెల్ మూసివేయడంతో అత్యవసర సాయం అందక అక్కడి పౌరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది.
వెంటనే గాజా సరిహద్దును తెరవాలని.. అక్కడి ప్రజలకు సహాయక చర్యలు, ఇంధన సరఫరా, వైద్య సహాయం అందించాలని ఇజ్రాయెల్‌ను కోరింది. ఈ మేరకు మంగళవారం యూఎన్ స్పోక్స్‌పర్సన్ స్టెఫాన్ డుజారిక్ జెనీవాలో మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
