ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూనే ఉగ్రవాదులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ తన అసలు రూపం మరోసారి బయటపెట్టుకుంది పాకిస్థాన్. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడిన హఫీజ్ సయీద్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి వెళ్లింది. వ్యక్తిగత ఖర్చుల కోసం సయీద్ కు డబ్బులు ఇప్పించాలని కోరింది. పాక్ అభ్యర్థనపై ఎవరి నుంచి అభ్యంతరాలు రాకపోవడంతో మండలి ఆమోదం తెలిపింది. దీంతో నెలకు లక్షన్నర రూపాయలు విత్ డ్రా చేసుకునేందుకు సయీద్ కు అనుమతి లభించింది.
ముంబై బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ ను 2012లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. UN భద్రతామండలి తీర్మానంతో సయీద్ బ్యాంక్ ఖాతాలను పాకిస్థాన్ నిలిపివేసింది. అయితే బ్యాంక్ ఖాతాలు సీజ్ చేయడంతో డబ్బులు లేక తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఇటీవలే పాక్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాడు సయీద్. నెలవారి ఖర్చుల కోసం తన ఖాతా నుంచి డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరాడు. సయీద్ అభ్యర్థనను యీఎన్ కు తెలిపింది పాకిస్థాన్.

