
కుక్క తోక వంకర అనే సామెత దాయాది పాకిస్థాన్ దేశానికి పర్ఫెక్ట్గా సూట్ అవుతోంది. ఎందుకంటే.. భారత్ చేతిలో చావు దెబ్బ తిన్న కూడా ఆదేశం తీరు మారదు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా అదే పనిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు పాలు పోసి పెంచి ప్రపంచ దేశాలపై దాడులకు ఉసి గొల్పుతోంది. 2025, ఏప్రిల్ 22న కూడా పాక్ ఇదే పని చేసింది.
భారత్‌పై పీకల దాకా విషం నింపుకున్న పాక్.. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి చేయించింది. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు పహల్గాంలోని టూరిస్ట్ ప్రాంతంలో పర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. పాక్ ఉగ్రమూకలు సృష్టించిన మారణహోమంలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటుగా ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలు, ట్రైనింగ్ క్యాంపులను ధ్వంసం చేసింది.
మిస్సైళ్లు, బాంబుల వర్షంతో భారత్ చేసిన మెరుపు దాడులతో ఉగ్రవాద స్థావరాలు నామారూపాల్లేకుండాపోయాయి. ఇప్పట్లో తిరిగి కోలుకోలేన నష్టం చవిచూశాయి ఉగ్రవాద సంస్థలు. ఈ తరుణంలో పాకిస్థాన్ మరోసారి తన నీచబుద్ధిని బయటపెట్టింది. ఆపరేషన్ సిందూర్లో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలను పాక్ తిరిగి నిర్మిస్తోంది. భారత నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి.
ఆపరేషన్ సిందూర్ దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ పునర్నిర్మించడం ప్రారంభించిందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. పాక్ ప్రభుత్వ మద్దతుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, దాని పరిసర ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాల కోసం కీలకమైన కేంద్రాలను పునర్నిర్మించడానికి పాకిస్తాన్ సైన్యం, గూఢచారి సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పని చేస్తున్నాయని వెల్లడించాయి.
►ALSO READ | US Visa: పాకిస్థానీలకు యూఎస్ వీసా కష్టమే.. రూల్స్ కఠినం చేసిన ట్రంప్
భారత నిఘా, దాడుల నుండి తప్పించుకోవడానికి నియంత్రణ రేఖ వెంబడి దట్టమైన అటవీ ప్రాంతాలలో చిన్న, హైటెక్ ఉగ్రవాద సౌకర్యాల శ్రేణిని అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్లో భాగంగా లష్కరే తోయిబా (LeT), జైషే మొహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి గ్రూపుల కోసం ఈ స్థావరాలు పునర్నిర్మిస్తున్నారు.
లూని, పుట్వాల్, టిప్పు పోస్ట్, జమిల్ పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్ ఫార్వర్డ్, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాలలో గతంలో ధ్వంసమైన శిబిరాలు పునర్నిర్మించబడుతున్నాయి. భారత ఇంటలిజెన్స్, థర్మల్, ఉపగ్రహ రాడార్ గుర్తించలేని విధంగా ఈ ప్రదేశాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో తిరిగి టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లు నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
దట్టమైన అటవీ ప్రాంతాలైన కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచిబన్, కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్‌కోట్, జంకోట్ ఏరియాల్లో కూడా కొత్త ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూడా నిర్మిస్తున్నారు. దట్టమైన అడవి కారణంగా ఈ ప్రదేశాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారు. ఈ డ్రోన్, ఉపగ్రహ నిఘా కంటికి చిక్కకుండా రక్షణ కల్పిస్తాయి. ఒక్కో స్థావరాన్ని ఒకేసారి 200 మంది టెర్రరిస్టులు నివాసం ఉండేలా నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.