US Visa: పాకిస్థానీలకు యూఎస్ వీసా కష్టమే.. రూల్స్ కఠినం చేసిన ట్రంప్

US Visa: పాకిస్థానీలకు యూఎస్ వీసా కష్టమే.. రూల్స్ కఠినం చేసిన ట్రంప్

Visa to Pakistani's: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెుదటి నుంచి వలసవాదానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశీయులు అమెరికా వీసా పొందటాన్ని పూర్తి స్థాయిలో కఠినతరం చేస్తోంది ట్రంప్ సర్కార్. ఈ క్రమంలో కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ కూడా ప్రకటించబడిన సంగతి తెలిసిందే. 

అయితే తాజాగా అమెరికా పాకిస్థాన్ నుంచి అమెరికా వెళ్లాలనుకునే ప్రయాణికులకు వీసా అప్లికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో వారి స్క్రీనింగ్ ప్రక్రియను, నిబంధనలను పెంచింది. ఇదే విషయాన్ని కరాచీ, లాహోర్ లో ఉన్న అమెరికా కౌన్సిలేట్ ప్రకటించింది. పాక్ వీసా అప్లికెంట్లు తమ ఏఫ్, ఎం, జే కేటగిరీ వీసాల కోసం కూడా సోషల్ ఖాతాలను పబ్లిక్ చేయాలని వెల్లడించింది. దీనికి ముందు ఇదే తరహా సూచనలను భారతదేశంలోని అప్లికెంట్లకు కూడా తప్పనిసరి చేస్తున్నట్లు దిల్లీలోని యూఎస్ ఎంబసీ వెల్లడించింది. 

అమెరికా లేదా దాని సంస్థల పట్ల ప్రతికూల అభిప్రాయాలు ఉన్న వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి అమెరికా ఈ తరహా చర్యలకు ఉపక్రమించిందని తెలుస్తోంది. వలసల తనిఖీని కఠినతరం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత వ్యూహంలో ఈ చర్య భాగంగా ఉంది. ఈ నిబంధనలు పాటించకపోతే వీసా తిరస్కరణకు అలాగే భవిష్యత్తులో అనర్హతలకు దారితీయవచ్చని ఎంబసీ హెచ్చరించింది. అయితే ఈ రూల్స్ జాతీయ భద్రతలో భాగంగా తీసుకున్న నిర్ణయమని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.