టీ20 వరల్డ్ కప్‌‌కే అసలైన మజా‌.. భారత్‎తో మ్యాచ్‎కు పాక్ ఓకే

టీ20 వరల్డ్ కప్‌‌కే అసలైన మజా‌.. భారత్‎తో మ్యాచ్‎కు పాక్ ఓకే

టీ20 వరల్డ్ కప్‎లో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. తొలుత మ్యాచ్​ను బహిష్కస్తున్నామని ప్రకటించిన పాక్​ ప్రభుత్వం.. ఆ తర్వాత ఐసీసీ, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో జరిగిన చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నది. అయితే బైలాటరల్ సిరీస్ గురించి మాత్రం ఎలాంటి ఒప్పందం లేదు.

లాహోర్‌‌‌‌: క్రికెట్ ఫ్యాన్స్‌‌కు గుడ్‌‌ న్యూస్‌‌. టీ20 వరల్డ్ కప్‌‌కే అసలైన మజా ఇచ్చే ఇండియా–పాకిస్తాన్‌‌ మ్యాచ్‌‌పై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి. ఈ నెల 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌‌ను బాయ్‌‌కాట్ చేయాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఐసీసీ ప్రతినిధులతో చర్చలతో పాటు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు నచ్చజెప్పడంతో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ ఒప్పుకుంది. 

ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి బాయ్‌‌కాట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించింది. ఇండియాతో మ్యాచ్‌‌ను బహిష్కరిస్తే ఇతర దేశాల క్రికెట్ బోర్డులపై పడే ఆర్థిక ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీలంక, యూఏఈ వంటి మిత్ర దేశాలు పాకిస్తాన్‌‌కు నచ్చజెప్పాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక అధ్యక్షుడు కుమార దిసానాయకేతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

క్రికెట్ బోర్డుల మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ, క్రీడా స్ఫూర్తిని కాపాడటానికి ఇండియా , పాకిస్తాన్ జట్ల మధ్య షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ నిర్వహించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తమ బోర్డును జట్టును ఆదేశించింది. కేవలం రాజకీయాల కోసమే క్రీడలను పక్కన పెట్టకూడదని, క్రికెట్ స్పూర్తిని కాపాడటమే తమ లక్ష్యమని పాకిస్తాన్ పేర్కొంది.

టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్‌‌పై ఎటువంటి జరిమానా విధించకూడదని ఐసీసీ అంగీకరించడం, పాకిస్తాన్ శాంతించడానికి ప్రధాన కారణమైంది. పీసీబీతో  చర్చలు విజయవంతమయ్యాయని, సభ్య దేశాలన్నీ తమ నిబద్ధతను గౌరవించి వరల్డ్ కప్‌‌ను సక్సెస్ చేయాలని ఐసీసీ కోరింది.