Asia Cup 2025: ఇండియాతో ఫైనల్ ఆడే జట్టేది.. కాసేపట్లో బంగ్లా, పాక్‌ల మధ్య నాకౌట్ పోరు

Asia Cup 2025: ఇండియాతో ఫైనల్ ఆడే జట్టేది.. కాసేపట్లో బంగ్లా, పాక్‌ల మధ్య నాకౌట్ పోరు

ఆసియా కప్ లో గురువారం (సెప్టెంబర్ 25) పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోకి జరగనున్న ఈ సమరంలో గెలిచిన జట్టు ఆసియా కప్ ఫైనల్ కు చేరుతుంది. టోర్నీలో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో టీమిండియా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. నేడు బంగ్లా, పాక్ లలో విజేతగా నిలిచిన జట్టు ఆదివారం (సెప్టెంబర్ 28) ఫైనల్ లో ఇండియా తో తలపడుతుంది. బలాబలాల పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మ్యాచ్ రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. 

బంగ్లా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్:

ఆసియా కప్ సూపర్-4 షెడ్యూల్ బంగ్లాదేశ్ కు కష్టంగా మారింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకకు షాక్ ఇచ్చిన బంగ్లా.. బుధవారం (సెప్టెంబర్ 24) ఇండియాతో మ్యాచ్ ఆడి ఓడిపోయింది. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా గురువారం (సెప్టెంబర్ 25) పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడనుంది. మూడు జట్లకు మ్యాచ్ ల మధ్యలో కనీసం ఒక రోజైనా గ్యాప్ ఉంది. కానీ బంగ్లాదేశ్ కు మాత్రం సూపర్-4లో ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్ లను రెండు రోజుల్లో ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ షెడ్యూల్ బంగ్లా విజయావకాశాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. జట్టు పరంగా బంగ్లా సమిష్టిగా ఆడితే పాకిస్థాన్ పై విజయం సాధించి ఫైనల్ కు చేరుకోవచ్చు. బౌలింగ్ పైనే బంగ్లా ఆశలు పెట్టుకుంది. 

శ్రీలంకపై విజయంతో పాక్ జట్టులో ఆత్మ విశ్వాసం:

సూపర్-4 లో భాగంగా తొలి మ్యాచ్ లో ఇండియాపై ఓడిపోయిన పాకిస్థాన్.. ఆ తర్వాత శ్రీలంకపై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఈ విజయం పాక్ జట్టులో ఎనర్జీని నింపుతుంది. ఇదే ఊపును కొనసాగించి బంగ్లాదేశ్ పై విక్టరీ కొట్టి ఫైనల్ చేరుకోవాలనే పట్టుదలతో కనిపిస్తుంది. పాకిస్థాన్ బలమంతా వారి బౌలింగ్. షహీన్ అఫ్రిది, హారీస్ రౌఫ్ లాంటి నాణ్యమైన పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. అబ్రార్ అహ్మద్ తన స్పిన్ తో చుట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బ్యాటింగ్ డెప్త్ ఉండడం పాకిస్థాన్ కు కలిసి రానుంది. బ్యాటింగ్ లో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మినహా ఎవరూ పెద్దగా ఫామ్ లో లేకపోవడం మైనస్ గా మారింది.