
- రికార్డు తేడాతో నెగ్గితేనే సెమీస్‌కు
- నేడు బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్
లండన్: ముందుగా బ్యాటింగ్ చేయాలి. కనీసం 350 రన్స్ చేయాలి. ప్రత్యర్థిని 39 రన్స్‌కు ఆలౌట్ చేయాలి. 400 చేస్తే.. 84 పరుగులకే ఆలౌట్ చేయాలి. సెమీఫైనల్ చేరాలంటే శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్క్ ఇది. వరల్డ్‌కప్‌లో మిగతా మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఆట చూశాక ఇది అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ టాస్ కోల్పోయి బౌలింగ్‌కు వస్తే.. తొలి బంతి పడకముందే పాక్ కథ ముగిసినట్టే. కేవలం టెక్నికల్‌గా రేసులో నిలిచినప్పటికీ సెమీస్ బెర్తును ఎప్పుడో దూరం చేసుకున్న పాక్ కనీసం విజయంతో టోర్నీని ముగించాలని ఆశిస్తోంది.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ గెలవడంతో పాక్‌కు దెబ్బ పడింది. 12 పాయింట్లతో హోమ్‌టీమ్ సెమీస్ చేరుకుంది. 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించిన కివీస్ 11 పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేట్‌తో నాలుగో ప్లేస్‌తో నాకౌట్ బెర్తును దాదాపు ఖాయం చేసుకుంది. పాక్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 9 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కానీ, మైనస్ రన్‌రేట్‌తో ఉన్న పాక్ ఈ పోరులో బంగ్లాపై రికార్డు విజయం సాధిస్తే తప్ప సెమీస్ చేరలేదు. మరోవైపు బంగ్లాదేశ్ ఎప్పుడో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. టోర్నీలో ఒకటి రెండు సంచలనాలు నమోదు చేయడంతో పాటు గత మ్యాచ్‌లో ఇండియాకు గట్టి పోటీ ఇచ్చిన బంగ్లా అదే ఉత్సాహంతో పాక్‌ను ఓడించి ఊరట దక్కించుకోవాలని భావిస్తోంది.