
చంఢీఘర్: హర్యానాలో పాకిస్థాన్ గూఢచారుల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రానికి చెందిన పలువురు గూఢచారులు అరెస్ట్ కాగా.. తాజాగా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై హర్యానాలోని మేవాట్ జిల్లా తౌరు తహసీల్‌లోని కంగర్కా గ్రామానికి చెందిన మహ్మద్ తారిఫ్‌ను సోమవారం (మే 19) నూహ్ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. భారత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐకి చేరవేస్తున్నారన్న ఆరోపణలపై తౌరు సదర్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు తారిఫ్‌పై కేసు నమోదు చేశారు.
పాక్ సీక్రెట్ సర్వీసెస్ ఏజెన్సీ (ఐఎస్ఐ)కి గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలపై రెండు రోజుల క్రితమే నూహ్ జిల్లా రజక గ్రామానికి చెందిన అర్మాన్ అనే వ్యక్తి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజులకే అదే నూహ్ జిల్లాలో మరో పాకిస్థాన్ గూఢచారి అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. మహ్మద్ తారిఫ్ అరెస్ట్‌తో పాకిస్థాన్‌కు గూఢచారులుగా పని చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.
కాగా, పాక్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పని చేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురుని శనివారం (మే 17) హర్యానా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరంతా పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారంతో పాటు, సైనిక రహస్య సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
గూఢచార్యం కేసులో అరెస్టైన 9 మంది వీరే:
గజాలా (పంజాబ్ నుండి అరెస్టు)
యాసీన్ మొహమ్మద్
నోమాన్ ఇలాహి (ఉత్తరప్రదేశ్‌లోని కైరానా నుండి అరెస్టు)
26 ఏళ్ల అర్మాన్ (నుహ్ నుండి అరెస్టు)
25 ఏళ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ (కైతాల్ నుండి అరెస్టు)
మొహమ్మద్ ముర్తజా అలీ (గుజరాత్ పోలీసులు జలంధర్ నుండి అరెస్టు చేశారు)
జ్యోతి మల్హోత్రా (హర్యానా నుండి అరెస్టు)
షాజాద్ (ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుండి అరెస్టు)
తరీఫ్ (నూహ్ నుండి అరెస్టు)