మాపై దాడి చేస్తే.. రియాక్షన్ 50 రెట్లు ఎక్కువ ఉంటది: పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

మాపై దాడి చేస్తే.. రియాక్షన్ 50 రెట్లు ఎక్కువ ఉంటది: పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్‌ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. ఈ క్రమంలో ఆప్ఘానిస్తాన్‎కు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జియో న్యూస్ ప్రైమ్‌టైమ్ షో ఆజ్ షాజెబ్ ఖాన్జాదా కే సాత్‌లో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్‎పై ఏదైనా దాడి జరిగితే దానికి 50 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. 

ఆప్ఘాన్ ఇండియా చేతిలో కీలు బొమ్మగా మారిందని అక్కసు వెళ్లగక్కారు. పశ్చిమ సరిహద్దులో తమ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను ఇండియా సాధనంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. తాలిబన్ పాలకుల తీరుతోనే కాబూల్, ఇస్లామాబాద్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయని అన్నారు. తాలిబన్ పాలకుల గొంతెమ్మ కోరికలతోనే శాంతి చర్చలు సఫలం కాలేదన్నారు. 

పాకిస్తాన్‌తో తక్కువ తీవ్రత కలిగిన యుద్ధంలో పాల్గొనాలని ఇండియా కోరుకుంటోందని.. ఇందుకోసం వారు ఆప్ఘానిస్తాన్‎ను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారని భారత్ పై ఆక్రోషం వెళ్లగక్కాడు. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ వైపు చూసినా వారి కళ్ళను పీకివేస్తామని ఘాటు హెచ్చరిక జారీ చేశాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి ఆప్ఘాన్ బాధ్యత వహిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు.

 కాగా, ఇటీవల ఆప్ఘాన్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరుదేశాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో రెండు వైపులా భారీగా ప్రాణ నష్టం సంభవించింది. ఈ క్రమంలో 2025, అక్టోబర్ 19న ఖతార్ మధ్యవర్తిత్వంతో దోహాలో పాక్, ఆప్ఘాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే.. ఇస్తాంబుల్‌లో టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వం వహించిన రెండవ రౌండ్ శాంతి చర్చలు విఫలమయ్యాయి.