పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు! : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు! : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి పేరు పెడతామని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​కు ఆయన వల్లే మెట్రో వచ్చిందన్నారు. మంగళవారం జైపాల్​ రెడ్డి 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్​ సర్కారు అధికారికంగా నిర్వహించింది. స్ఫూర్తి స్థల్​ వద్ద మంత్రి కోమటిరెడ్డితో పాటు మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి, స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్​ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో జైపాల్​ రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు. 

ఆయన ఆకాక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పారు. జైపాల్​ రెడ్డి పాటించిన నైతిక విలువలు భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దేశంలోని ఐదుగురు ఉత్తమ పార్లమెంటేరియన్లలో జైపాల్​ రెడ్డి ఒకరని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్​గా జైపాల్​ రెడ్డికి మంచి గుర్తింపు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గాంధీభవన్‌‌లోనూ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. పలువురు సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు జానా రెడ్డి, చిన్నా రెడ్డి, ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో.. 

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. మంగళవారం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్టీ సంజయ్ జాజు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఉపాధ్యక్షుడు ధరమ్ పాల్ మోరియా, అఖిల భారత యువ సమతా మాజీ అధ్యక్షుడు హుస్సేన్ వాహీద్, కాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సెక్రటరీ జనరల్ డాక్టర్​ వినోద సేఠీ, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ట్రస్టీ సుహస్ బోర్కర్, జైపాల్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు, పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. భారత రాజకీయాల్లో అధ్యయనం, అవగాహన, వాక్పటిమల మేళవింపుగా రాణించిన అరుదైన రాజకీయవేత్త జైపాల్ రెడ్డి అని గౌరవ్ ఉప్పల్ అన్నారు.

తెలంగాణ ఏర్పాటుపై చర్చించే వాళ్లం : వివేక్​ వెంకటస్వామి

జైపాల్​ రెడ్డి జీవితాంతం నీతి, నిజాయతీగల రాజకీయ నాయకుడిగా కొనసాగారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. తన తండ్రి వెంకటస్వామితో జైపాల్​ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవన్నారు. ఇద్దరు కలిసి అనేక ఉద్యమాలు చేశారన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్లి.. తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించే వాళ్లమని గుర్తుచేశారు. పార్లమెంట్​లో తెలంగాణ బిల్లు పెట్టడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. నాటి స్పీకర్​ మీరా కుమార్​ను కలిసి వాయిస్​ ఓటుతో పార్లమెంట్​ బిల్లు పెట్టొచ్చని సూచనలు చేశారన్నారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్​ ఓ పెద్ద రాజకీయ నాటకమాడారని, తానే లేకుంటే రాష్ట్రం సాధ్యమయ్యేది కాదన్నట్టు మాట్లాడారని వివేక్​ మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కూడా జైపాల్​ రెడ్డి దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. జైపాల్​ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కాగా, జైపాల్​ రెడ్డికి నివాళులర్పించిన వారిలో వివేక్​ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ ఉన్నారు.