- వెయ్యికిపైగా సెంటర్లకు ఓకే చెప్పిన కేంద్రం.. ఇక్కడ పెట్టింది మాత్రం ఎనిమిదే
- పిల్లలను చూసుకునే వారులేక.. ఉపాధికి దూరమవుతున్న మహిళలు
- తక్కువ జీతాలకు ఆయాలు దొరకట్లేదంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: పేద, మధ్య తరగతి మహిళలు పిల్లల పెంపకం కారణంగా ఉపాధికి దూరం కావొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘పాలన’ స్కీమ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ డే కేర్ సెంటర్లకు ధీటుగా.. అంగన్‌వాడీల అనుసంధానంతో నడవాల్సిన ఈ ప్రభుత్వ క్రెష్ లు (చైల్డ్ కేర్ ఇనిస్టిట్యూషన్స్) క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.
తమ పిల్లలను ఈ సెంటర్లలో క్షేమంగా ఉంచి.. ధీమాగా పనులకు వెళ్దామనుకున్న తల్లులకు నిరాశే మిగులుతున్నది. ఫలితంగా చిన్నారులను చూసుకునేందుకు.. ఆర్థికంగా ఆసరానిస్తున్న ఉద్యోగాలకు మహిళలు టాటా చెప్పి ఇంటికే పరిమితం కావాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా.. ఈ క్రెష్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు.
ఉపాధికి దూరమవుతున్న తల్లులు..
ఆర్థికంగా వెనకపడిన కుటుంబాల్లో భార్య భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే.. అవసరాలు తీరుతాయి. కాన్పు తరువాత కోలుకున్నాక ఉద్యోగానికి, పనికి వెళ్లాలంటే పిల్లలను చూసుకునేవారు ఉండరు. పిల్లలను డే కేర్ సెంటర్లలో జాయిన్ చేసి పనికి వెళ్దామంటే.. ప్రైవేట్ డే కేర్ సెంటర్లలో ఫీజులు వేలల్లో ఉంటాయి. దినసరి కూలీలు, చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే మహిళలు అంత మొత్తం భరించలేరు.
అలాంటి వారి కోసమే ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల ఆలనపాలన చూసుకునేలా, ఇంటి నుంచి తీసుకొచ్చిన పౌష్టికాహారం, ఆరోగ్యం అందించేలా ‘పాలన’ కేంద్రాలను డిజైన్ చేశారు. కానీ రాష్ట్రంలో ఇవి అందుబాటులో లేకపోవడంతో మూడేండ్లలోపు పిల్లలు ఉన్న తల్లులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆదాయం తగ్గి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.
ఆ జీతాలకు ఎవరొస్తలేరు
డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంపై విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు పలు కారణాలు చెబుతున్నారు. ఈ సెంటర్లలో పనిచేసేందుకు చాలీచాలని జీతాల కారణంగా సిబ్బంది దొరకడం లేదని, దీంతో సెంటర్ల ఏర్పాటు సాధ్యం కావడం లేదంటున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం స్టాండ్ అలోన్ పాలన సెంటర్లకు నెలకు రూ. 6,500, అంగన్ వాడీ కమ్ క్రెష్ లు (ఏడబ్ల్యూసీసీలు) నెలకు రూ. 5,500 హెల్పర్ (ఆయా)కు రూ. 3,500 మాత్రమే గౌరవ వేతనం ఇస్తారు.
వీరు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పిల్లల బాగోగులు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంత తక్కువ మొత్తానికి రోజంతా పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆఫీసర్లు అంటున్నారు. పాలన సెంటర్ల ఏర్పాటును గతంలో అంగన్వాడీలు వ్యతిరేకించినట్లు అధికారులు గుర్తుచేస్తున్నారు.
మూడేండ్లలోపు పిల్లలకు క్రెష్ సెంటర్లు, మూడేండ్ల పై బడిన పిల్లలకు ప్రభుత్వం ప్రీ స్కూల్ తీసుకొస్తుందని.. వీటి ద్వారా అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశం కనిపిస్తుందని అంగన్వాడీ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ జయలక్ష్మి ఆరోపించారు. క్రెష్ లు ఏర్పాటు చెయ్యొద్దని, చేస్తే అంగన్వాడీ సెంటర్లతో అనుసంధానం చేసి, తమ సిబ్బందినే.. తీసుకొని నిర్వహించాలని గతంలో మంత్రికి వినతి పత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్రెష్ల ఏర్పాటుకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి.. ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వెయ్యికి పైగా సెంటర్లకు.. ఏర్పాటు చేసింది ఎనిమిదే
రాష్ట్రంలో మిషన్ శక్తిలో భాగంగా అంగన్‌వాడీ కమ్ క్రెష్ లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. కానీ.. రాష్ట్ర విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఇప్పటివరకు కేవలం ఎనిమిది సెంటర్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. ఈ ఎనిమిది సెంటర్లలో.. కేవలం 145 మంది చిన్నారులు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి ఈ స్కీమ్ అమలుకు సంబంధించి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు.
రాష్ట్రంలోని బస్తీలు, కాలనీలు, స్లమ్లలో డేకేర్ సెంటర్లు అవసరం ఉందా.. అని ప్రజల నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు మంచి స్పందన లభించింది. ఉద్యోగాలు చేసుకునే మహిళల నుంచి భారీ స్పందన వచ్చింది. కానీ.. ఆచరణలో మాత్రం ఆఫీసర్లు చేతులెత్తేశారనే విమర్శలు వస్తున్నాయి.
