అన్నాడీఎంకేలో చీలిక.. పళనిస్వామి పదవికి రాజీనామా గండం..!

అన్నాడీఎంకేలో చీలిక.. పళనిస్వామి పదవికి రాజీనామా గండం..!

చెన్నై: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీలో చీలికలు తెచ్చాయా..? ఎన్నికల్లో అన్నాడీఎంకే మరోసారి పూర్ ఫెర్ఫామెన్స్ కనబర్చడంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి పని తీరుపై పార్టీ నాయకత్వం అసంతృప్తిగా ఉందా..? పార్టీ  వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయా..? అంటే అన్నాడీఎంకే వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ పూర్ ఫెర్ఫామెన్స్ కనబర్చింది.

 234 స్థానాలకు గానూ కేవలం 47 సీట్లలో మాత్రమే విజయం సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో పళనిస్వామి నాయకత్వంపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో వరుస అపజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సీవీ. షణ్ముగం, ఎస్పీ వేలుమణి వంటి సీనియర్ నాయకులు, పలువురు మాజీ మంత్రులు పళనిస్వామి నాయకత్వంపై తమ అభ్యంతరాలను బహిరంగంగా వ్యక్తం చేశారని, ఇటీవల ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశానికి కూడా హాజరు కాలేదని సమాచారం.

 విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు విషయంలో సీవీ. షణ్ముగం, పళనిస్వామి వర్గాలు రెండుగా చీలినట్లు తెలుస్తోంది. టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని పళనిస్వామి వర్గం, టీవీకే సపోర్ట్ చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేస్తున్నాయి. షణ్ముగం వర్గం తిరుగుబాటుతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిందని.. అన్నాడీఎంకేకు చెందిన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి రెండు వర్గాలు రావడమే ఇందుకు నిదర్శమంటున్నారు విశ్లేషకులు. 

సోమవారం (మే 11) అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అందరూ ఒకేసారి అసెంబ్లీకి రాకుండా రెండు బృందాలుగా అసెంబ్లీకి వచ్చారు. ఒక బృందంలో పళనిస్వామి, కేపీ మునుస్వామి, తలవై ఎన్ సుందరం వంటి నాయకులు ఉండగా, మరో బృందంలో వేలుమణి, డాక్టర్ సి విజయభాస్కర్ ఉన్నారు. ఇది పార్టీలో చీలిక ఉందనే ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. 

పళనిస్వామి వైదొలగాలి: కేసీ పళనిస్వామి 

అన్నాడీఎంకేలో విభేదాలపై ఆపార్టీ మాజీ నాయకుడు కేసీ పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో స్పష్టమైన చీలిక ఉందని.. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వంలో మార్పు కోరుకుంటున్నారని అన్నారు. పళనిస్వామి పార్టీ చీఫ్‎గా కొనసాగితే కొంతమంది ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ పళనిస్వామి పార్టీ నాయకుడి పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కోరారు. 

అన్నాడీఎంకేను ఏ శక్తి విచ్ఛిన్నం చేయలేదు: ఎమ్మెల్యే ఈశాకి సుబయ్య

అన్నాడీఎంకేలో అసంతృప్తి ఉందన్న వదంతులను ఆ పార్టీ ఎమ్మెల్యే ఈశాకి సుబయ్య తీవ్రంగా ఖండించారు. పార్టీలో పరిస్థితి అంతా సజావుగా ఉందని స్పష్టం చేశారు.అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేసే శక్తి ఎవరికీ లేదని.. ఈ విషయాన్ని మీడియా అతిగా హైలెట్ చేయొద్దని ఆయన కోరారు.