అవినీతికి పాల్పడినోళ్లే బీఆర్​ఎస్​ను వీడుతున్నరు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

అవినీతికి పాల్పడినోళ్లే  బీఆర్​ఎస్​ను వీడుతున్నరు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసమే కొంత మంది బీఆర్​ఎస్​ నాయకులు  కాంగ్రెస్‌లోకి, బీజేపీలోకి వెళ్తున్నారని బీఆర్‌‌ఎస్ నేత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఆరోపించారు. వాళ్లు ఎక్కడికిపోయినా వదిలిపెట్టేది లేదని, వాళ్లు చేసిన అవినీతిని బయటపెడ్తామని అన్నారు. అధికార పార్టీలో ఉంటే ఇంకా అవినీతి చేయొచ్చునని వాళ్లు అనుకుంటున్నారని, అలా జరగనీయకుండా వెంటాడుతామని ఆయన చెప్పారు. శుక్రవారం తెలగాణ భవన్‌లో మీడియాతో పల్లా రాజేశ్వర్​రెడ్డి మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌, బీజేపీకి అభ్యర్థులు లేరని, అందుకే తమ పార్టీ నాయకులను అదిరించి, బెదిరించి చేర్చుకుంటున్నారని విమర్శించారు.

‘‘ఇదే అదునుగా కొంత మంది పిరికిపందలు.. వాళ్ల అక్రమాలను సక్రమం చేసుకోవడం కోసం, మరిన్ని అక్రమాలు చేయడం కోసం పార్టీ మారుతున్నరు. ఏ అక్రమాలనైతే సక్రమం చేసుకుందామని వాళ్లు పార్టీ మారుతన్నరో అది జరగనివ్వం. వారిని వెంటాడి, వేటాడి అక్రమాలు అన్నింటినీ బయటపెడ్తం” అని ఆయన అన్నారు. ఒక పార్టీలో ఎన్నికై ఇంకో పార్టీలోకి పోతున్నవారిని రాళ్లతో, చెప్పులతో కొట్టాలని రేవంత్‌ రెడ్డి గతంలో అన్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినవాళ్లను దేనితో కొడుతారో ఆయన చెప్పాలని పేర్కొన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వల్ల 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం లెక్కలు తీయించి పరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు. పంట నష్టంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అబద్ధాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘‘గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వెయ్యలేదంటూ ఆయన మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నడు. బీఆర్‌‌ఎస్ సర్కార్‌‌లో ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించింది” అని తెలిపారు.