పామాయిల్ రైతులు రాష్ట్ర రైతాంగానికే దిక్సూచి

పామాయిల్ రైతులు రాష్ట్ర రైతాంగానికే దిక్సూచి

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

అశ్వారావుపేట టౌన్, వెలుగు: జిల్లాలోని పామాయిల్ రైతులు రాష్ట్ర రైతాంగానికి దిక్సూచిగా మారారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే ఆయిల్‌ పామ్ సాగుపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వా డ అజయ్‌ కుమార్‌ సూచించారు. రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. శనివారం దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్‌ పామ్‌ కర్మాగారాన్ని ఆయన సందర్శించారు. ముందుగా ముష్టిబండ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

అనంతరం ఆయిల్‌ పామ్‌ కర్మాగారాన్ని సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ఫ్రూటును అందించటం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది జూన్ నెల తప్ప మిగతా అన్ని నెలల్లో టన్ను పామాయిల్ గెలల ధర రూ.10 వేలకు పైమాటే అని తెలిపారు. 10 వేలకు తగ్గకుండా ఉండేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అశ్వా రావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆయిల్‌ ఫామ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణా రెడ్డి, ఎండీ నిర్మల, స్పెషల్‌ కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వరరావు, ఆర్డీవో స్వర్ణలత జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్‌ ఆఫీసర్‌ మరియన్న, అశ్వా రావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీ మేనేజర్లు బాలకృష్ణ, శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.