- తొలివిడుత ఊళ్లలో కొత్త పంచాయితీ
- జెండాలు, దేవుడి ఫొటోలు పట్టుకొని ఇండ్లకు
- డబ్బు తిరిగివ్వాలని సెల్ టవర్ ఎక్కిన మరో అభ్యర్థి
- ప్రమాణాలు చేయిస్తూ నిలదీతలు.. శాపనార్థాలు
- ఆందోళనలో పల్లె ఓటర్లు..తాళాలు వేసి బంధువుల ఇండ్లకు..
హైదరాబాద్: తొలివిడుత పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టాయి. భారీగా ఖర్చు పెట్టి, మందు, పైసలు పంచి ఓడిపోయినోళ్లు కొత్త రాగం అందుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని లేదంటే దేవుడిపై ప్రమాణం చేయాలంటూ ఇంటింటికీ తిరుగుతున్నారు. గిరిజన తండాల్లో సేవాలాల్ జెండాను చేతపట్టుకొని మరీ ప్రమాణం చేయిస్తున్నారు. మహబూబాబాద్ మండలం సోమ్లా తండాకు చెందిన భూక్యా కౌసల్య సర్పంచ్ గా పోటీ చేశారు.
గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించడంతోపాటు గ్రామంలో డబ్బులు కూడా పంచారు. 27 ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో ఆగ్రహించిన కౌలస్య చేతిలో సేవాలల్ జెండా పట్టుకొని ఇంటింటికీ వెళ్లారు. తనకు ఓటేసినట్టు ప్రమాణం చేయాలని లేదా తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖమ్మం జిల్లా హర్యా తండాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. కానీ ఇక్కడ ఓడిన అభ్యర్థి సెల్ టవర్ ఎక్కాడు. తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాలోత్ రంగ ఏకంగా తండాలో 4 లక్షలు ఖర్చు పెట్టాడు. పైసలు తీసుకొని మరీ తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
పది లక్షలు ఖర్చు పెట్టిన
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి ఔరవాణి గ్రామపంచాయతీకి తొలివిడుతలో ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన కల్లూరి బాల్ రాజు ఓటమి పాలయ్యాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతులో బరిలోకి దిగిన జక్కపల్లి పరమేశ్ 448 ఓట్ల మెజార్టీతో గెలిచాడు. దీంతో తన డబ్బులు తనకు ఇవ్వాలని లేదా దేవుడి మీద ప్రమాణం చేయాలని ఇంటింటికీ తిరిగి డబ్బులు వసూలు చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఒక చేతిలో దేవుడి ఫొటో, మరో చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతున్నారు. కన్నీరు పెట్టుకొని డబ్బులు వసూలు చేస్తున్నారు.

