- వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలపడాలనే వ్యూహం
- కాంగ్రెస్ తరఫున స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి
- మండలాల వారీగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు.. ఆశావహులతో వరుస సమావేశాలు
- బీఆర్ఎస్కు జీవన్మరణ సమస్యలా లోకల్ ఎన్నికలు
- జిల్లాల పర్యటనకు కేటీఆర్.. క్యాడర్‌కు డైరెక్షన్
- ఉత్తర తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
- మెజారిటీ సర్పంచ్‌లను గెలిచి రావాలని
- ఎంపీలు, ఎమ్మెల్యేలకు పార్టీ టార్గెట్
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంది. మొదటి దశ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహిస్తారు. స్వతంత్ర గుర్తులపైనే సర్పంచ్, వార్డు మెంబర్లు బరిలో దిగుతారు. పార్టీల రాజకీయాలు పల్లెలను కలుషితం చేయవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ కొన్నేళ్లుగా ప్రధాన పార్టీలు లోకల్‌బాడీ ఎన్నికలను టార్గెట్చేస్తున్నాయి.
జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులుగా తమ వాళ్లు ఉంటే పార్టీ పునాదులు బలంగా ఉంటాయని భావిస్తుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ఎన్నికల్లో గెలిచే పాలకవర్గాలు మరో ఐదేండ్లపాటు ఉనికిలో ఉంటాయి. ఈలోపే, అంటే వచ్చే మూడేండ్లలో అసెంబ్లీ, పార్లమెంట్ఎలక్షన్స్ జరుగుతాయి.
ఆ సమయంలో తమ పార్టీ ప్రతినిధులు గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులుగా ఉంటే తమ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ పంచాయతీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి.
ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్.. ఎలాగైనా మెజారిటీ గ్రామ పంచాయతీలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఆ పార్టీ హైకమాండ్ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ చార్జీలను రంగంలోకి దింపి, గెలుపు గుర్రాల వేటలో పడింది.
అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీఆర్ఎస్కు తాజా ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాల్లో పర్యటిస్తూ ఎలాగైనా మెజారిటీ స్థానాల్లో గెలిచి తీరాలంటూ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక 2029 తర్వాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. పల్లెలపై పట్టు సాధించాలనే కసితో ఉంది.
ఉత్తర తెలంగాణలో మెజార్టీ సర్పంచ్ స్థానాలపై కన్నేసిన కాషాయపార్టీ పెద్దలు.. వాటిని గెలిపించుకురావాల్సిన బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలకు కట్టబెట్టడం ఇందుకు ఊతమిస్తోంది. మొత్తం మీద ప్రధాన పార్టీలన్నీ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
జిల్లాల బాటలో కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వరుస ఓటములతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ ఓడిపోవడంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో వస్తున్న లోకల్‌బాడీ ఎన్నికలు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని గుర్తించిన హైకమాండ్ ఎలక్షన్స్‌ను సీరియస్‌గా తీసుకున్నది.
కాకపోతే ఆ పార్టీ ఇప్పటివరకు పార్టీపరంగా కమిటీల జోలికి వెళ్లకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలు లేకపోవడంతో ఏదైనా సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. వీటన్నింటిని అధిగమించి కార్యకర్తలు, పార్టీ శ్రేణులను సమయాత్తం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాల పర్యటనలు చేపట్టారు.
మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ చెక్కుచెదరకుండా ఉండాలంటే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో మనవాళ్లే ఉండాలని ఇటీవల వరంగల్పర్యటనలో కార్యకర్తలకు సూచనలిచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్తీరును, ఆరు గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించాలని, ప్రధానంగా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టాలని, తమను గెలిపిస్తే గ్రామంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఉత్తర తెలంగాణపై బీజేపీ ఫోకస్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కన్నేసిన బీజేపీ ఇందుకు లోకల్‌బాడీ ఎన్నికలను ఆసరా చేసుకోవాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైనందున పంచాయతీ ఎన్నికల ద్వారా పల్లెల్లోనూ పట్టు సాధించాలని యోచిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లా ల్లో మెజారిటీ పంచాయతీలు తమ ఖాతాలో వేసుకనే లక్ష్యంతో ముందుకు కదులుతోంది.
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లోని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ ప్రాంతాల్లో అత్యధిక సర్పంచ్స్థానాలను గెలిపించుకొని రావాల్సిన బాధ్యతలను ప్రజాప్రతినిధులకే అప్పగించింది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన మరుసటి రోజే బీజేపీ ఎన్నికల కమిటీ ముఖ్యుల సమావేశాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నిర్వహించి, ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
బుధవారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, జిల్లా అధ్యక్షులతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో స్థానిక ఎన్నికలను నిర్లక్ష్యం చేశామని, ఈసారి సాధ్యమైనన్నీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి కాషాయ జెండా ఎగరయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
లెఫ్ట్ పార్టీలు తలోదారి
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో మాత్రమే లెఫ్ట్‌పార్టీలకు పట్టున్నది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎం పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలపై ప్రభావం చూపించే సత్తా ఉన్నప్పటికీ ఈ రెండు పార్టీలు తలోదారిన వెళ్తున్నాయి. సీపీఐ గత అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని ఇటీవలి జూబ్లీహిల్స్ఉప ఎన్నికల దాకా కాంగ్రెస్‌పార్టీకి మద్దతు తెలిపింది. ప్రస్తుతం లోకల్‌బాడీ ఎన్నికల్లో మద్దతుపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కలిసి పోటీ చేసే విషయమై సీపీఎంతోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలోనూ ఇదే పరిస్థితి ఉండడంతో లెఫ్ట్‌పార్టీల క్యాడర్ ఎక్కడికక్కడ అభ్యర్థులను బట్టి మద్దతు ఇవ్వడం పరిపాటిగా మారింది.
జూబ్లీహిల్స్ జోష్‌లో అధికార పార్టీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. అదే ఊపుతో లోకల్బాడీలనూ క్లీన్ స్వీప్చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మెజారిటీ గ్రామ పంచాయతీలను తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ హైకమాండ్ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జీలతోపాటు మండల స్థాయి నేతలను రంగంలోకి దించింది.
గ్రామాల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నవారికి తగిన గుర్తింపు ఇవ్వాలని, అలాంటివారినే తమ అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకోవాలని హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు జిల్లాల్లో మంత్రులు, డీసీసీబీ చైర్మన్లు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇంచార్జీలు రంగంలోకి దిగి, మండలాలవారీగా ఆశావహులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రెబల్స్బెడద లేకుండా స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏకాభిప్రాయం సాధించేలా చర్చలు జరుపుతున్నారు. అవకాశం ఉన్నచోట ఏకగ్రీవాలకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు పార్టీ తరఫున 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందడంతో ఆ సామాజిక వర్గాలవారికి పెద్దపీట వేస్తున్నారు.
ఇందుకోసం మండలాలవారీగా బీసీల జాబితాలను రెడీ చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేసిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, సన్నవడ్ల బోనస్, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, మహిళా సంఘాలకు వ్యాపారాలు, విరివిగా రుణాలు, వడ్డీ చెల్లింపు తదితర సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లి ఓట్లు అడిగేందుకు సిద్ధమవుతున్నారు.
