- వాట్సాప్ గ్రూపులు.. ఫేస్ బుక్.. ఇన్స్ట్రాలో పోస్టులు
- అదనపు ఖర్చు లేకుండా ప్రచారం
యాదాద్రి, వెలుగు: పల్లెలో ఎటు చూసినా పంచాయతీ ఎన్నికల సందడే కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. మూడు విడతల్లో జరగాల్సిన పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి విడతకు సంబంధించి అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. రెండో విడత ఎన్నికల జరిగే పంచాయతీల్లో శనివారం విత్ డ్రా ప్రక్రియ ముగిసిన వెంటనే అభ్యర్థులెవరో తేలిపోనుంది. ఆ వెంటనే అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయిస్తారు. ఇక మూడో విడతకు సంబంధించి స్క్రూటినీ, విత్ డ్రా, అభ్యర్థులెవరో రెండు రోజుల్లో తేలిపోతుంది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది.
మొత్తంగా 11 రోజులే గడువు
ఈ నెల 11న జరిగే మొదటి విడతకు సంబంధించి ప్రచారానికి ఐదు రోజులే గడువుంది. ఆ తర్వాత వరుసగా రెండు, మూడు దశల ఎన్నికల వరకూ ప్రచారం కోసం ఉన్నది మొత్తంగా 11 రోజులే. ప్రచారానికి తక్కువ సమయం ఉండడం, ఓటర్లుకుడా తక్కువగానే ఉన్నా ప్రచారానికి ఖర్చు మాత్రం తగ్గేట్టు కన్పించడం లేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనుభవంతో అభ్యర్థులనుంచి ఓటర్లు ఏవో ప్రయోజనాలను ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ముందే ఖర్చులకు ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా పోలింగ్ ముందు రోజూ చూసుకోవచ్చన్నట్టు వ్యవహరిస్తున్నారు.
సోషల్ మీడియా ప్రచారం
డిజిటల్ యుగంలో అందరూ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నారు. ప్రతి ఒక్కరూ వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియా యాప్స్ విరివిగా చూస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ సోషల్ మీడియాను ప్రచారాస్త్రంగా అభ్యర్థులు ఎంచుకున్నారు. ఇప్పటికే వార్డుకో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులోనూ యువత, మహిళలకు వేర్వేరు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామాలకు వాట్సప్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాలో వారి మద్దతుదారులు, గ్రామస్థుల సెల్ఫోన్ నంబర్లతో ప్రత్యేక వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ గ్రూపుల్లో ఎన్నికల విజ్ఞాపనలు కుప్పలుగా ముంచెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా అభ్యర్థులకు పైసా కూడా ఖర్చు లేదు. ప్రతి ఒక్కరూ నెట్ కనెక్షన్ కలిగి ఉన్న వారే. కాకుంటే పోస్టర్లను తయారు చేయించుకోవడానికి డిజైనర్లను ఆశ్రయిస్తున్నారు. వాటిని గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు. తాము గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటి ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీల మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
సూర్యాపేట, వెలుగు: హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తానని ఎస్పీ నరసింహ తెలిపారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, క్రీడా పోటీలను ఎస్పీ ప్రారంభించారు. హోంగార్డులు పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పని చేస్తున్నారని అభినందించారు. అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ రామారావు, హోంగార్డ్ ఇన్చార్జి ఆర్ఎస్సై అశోక్, సాయిరాం, సురేశ్ ఉన్నారు.
