పొత్తులు కాదు.. స్థానిక సర్దుబాట్లకు సై!

పొత్తులు కాదు..  స్థానిక సర్దుబాట్లకు సై!
  • పంచాయతీ ఎన్నికల్లో పార్టీల మాట పక్కనపెట్టి ఒకరికొకరు మద్దతు 
  • కొన్నిచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్టు చేస్తున్న బీఆర్ఎస్ 

ఖమ్మం జిల్లా ముదిగొండలో సర్పంచ్​ స్థానం ఎస్సీ జనరల్ కు రిజర్వు కాగా, కాంగ్రెస్​ పార్టీ తరఫున ఉసికల రమేశ్​ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గ్రామంలోని బీఆర్​ఎస్, టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్​అభ్యర్థికే మద్దతిస్తున్నామని ప్రకటించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​, సీపీఎం పొత్తుతో పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే, బీఆర్ఎస్​   గ్రామ శాఖ మాత్రం కాంగ్రెస్​కే మద్దతు ప్రకటించింది. 

దీంతో బీఆర్ఎస్​ తరఫున జడ్పీ మాజీ చైర్మన్​ లింగాల కమల్ రాజు, సీపీఎం నేత బండి రమేశ్​ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి బీఆర్ఎస్, సీపీఎం పొత్తులకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

 అయినా బీఆర్ఎస్​ గ్రామ శాఖ మాత్రం తమ పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని ప్రకటించింది. ముదిగొండ ఒక్కటే కాదు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా గ్రామాల్లో పొత్తులు, పార్టీలను పక్కనపెట్టి ఒకొరికొకరు మద్దతు తెలుపుకొనేందుకే ప్రాధాన్యతనిస్తున్నారు. 

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు  :   గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా పల్లెల్లో రాజకీయ ఎత్తుగడలు రసవత్తరంగా మారాయి. పార్టీ గుర్తులు లేకుండా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నా, ఆయా పార్టీల మద్దతుతోనే అభ్యర్థులు పోటీలో ఉంటారు. సర్పంచ్ ఎన్నికల్లో సాధారణంగా రాజకీయ పార్టీలు పొత్తులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కానీ ఈసారి ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ పార్టీలు పొత్తులను పక్కనపెట్టి సర్దుబాట్లకు జై కొడుతున్నాయి. తమతో కలిసి వచ్చే ఏ పార్టీ వారితోనైనా కలిసి, తమ వాళ్లను బరిలోకి దింపుతున్నారు. 

మరోవైపు ఒక పార్టీలో ఉన్న నేతలే తమకు నచ్చిన వారిని రెబల్స్​ గా బరిలోకి దింపుతూ తెరవెనుక ప్రచారాలు నిర్వహిస్తుండం ఆసక్తికరంగా మారింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన క్యాండిడేట్లకు వ్యతిరేకంగా, అదే పార్టీకి చెందిన లీడర్లు సొంత అనుచరులను పోటీలో నిలబెడుతున్నారు. ప్రధానంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల్లో ఈ సర్దుబాట్లు, లోపాయికారీ పొత్తుల చర్చలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే బరిలోకి దించిన వారిని కాదని, అదే పార్టీకి చెందిన కొందరు ముఖ్య నేతలు తమ అనుచరులను రంగంలోకి దింని  ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థులను కాంగ్రెస్ రెబల్స్ గా రంగంలోకి దింపి, పలు పార్టీలను ఏకం చేసే దిశగా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు.

పొత్తులను పక్కనపెట్టి.. 

ఎన్నికలకు ముందు పొత్తుల కోసం పలు పార్టీల నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్​ తో సీపీఐ పొత్తులను ప్రకటించగా, సీపీఎంను కలుపుకోవాలని కాంగ్రెస్​ ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్​ తో సీపీఎం కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించింది. టీడీపీతో పాటు ఇతర చిన్న పార్టీలను కలుపుకుని కొందరు ముఖ్య నేతలు, ఆయా పార్టీల పెద్దలతో మంతనాలు చేశారు. తీరా నామినేషన్ల పర్వం ముగుస్తున్న క్రమంలో పొత్తులను పక్కనపెట్టి, సర్దుబాటులకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులను బట్టి కేవలం గెలుపే లక్ష్యంగా సర్దుబాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. బీఆర్ఎస్, సీపీఎం పొత్తు పెట్టుకున్నాయి. 

పొత్తులకు అనుగుణంగా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను పంచుకుంటున్నారు. కామేపల్లి మండలం రామకృష్ణాపురంలో మొన్నటి వరకు బీజేపీ సర్పంచ్ ఉన్నారు. ఇప్పుడు ఆ గ్రామంలో కాంగ్రెస్​ అభ్యర్థికి బీజేపీ సపోర్ట్ చేస్తోంది. కామేపల్లిలో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి టీడీపీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. ఇక కల్లూరు మండలం ఎర్రబోయినపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థికి టీడీపీ మద్దతు ప్రకటించగా, యజ్ఞ నారాయణపురంలో బీఆర్​ఎస్​ అభ్యర్థికి టీడీపీ సపోర్ట్ చేస్తోంది. మరోవైపు పెనుబల్లి, తల్లాడ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్​ రెబల్స్ బరిలో ఉన్నారు. ఆ రెబల్స్​ కు స్థానిక బీఆర్ఎస్​ నేతలు సపోర్ట్ చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.