పంచాయతీ ఉద్యోగుల సమ్మె.. నోటీసు ఈనెల 21 తర్వాత  ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తాం : జేఏసీ

 పంచాయతీ ఉద్యోగుల సమ్మె..  నోటీసు ఈనెల 21 తర్వాత  ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తాం : జేఏసీ

హైదరాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 21 తరువాత ఏ రోజైనా సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ తేల్చి చెప్పింది. సోమవారం పంచాయతీ రాజ్  కమిషనర్ కు ఈ మేరకు నోటీసు ఇవ్వాల్సి ఉండగా ఆయన అందుబాటులో లేకపోవడంతో హిమాయత్ నగర్ లోని పంచాయతీ రాజ్ ఆఫీసులో డిప్యూటీ కమిషనర్ రామారావుకు జేఏసీ నోటీసు ఇచ్చింది.

జేఏసీ చైర్మన్  పాలడుగు భాస్కర్, జనరల్  సెక్రటరీ నారాయణ, సీఐటీయూ నుంచి వెంకటయ్య, జనరల్ సెక్రటరీ యజ్ఞనారాయణ, ఏఐటీయూసీ నుంచి వెంకటరాజ్యంతో పాటు మరో ఆరుగురు నేతలు నోటీసు అందజేశారు. పంచాయతీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు  ఇవ్వాలని, కార్మికులకు తీవ్ర ఇబ్బందిగా మారిన మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్  చేశారు. అలాగే బిల్ కలెక్టర్లు, కారోబార్లకు స్పెషల్  ఇవ్వాలన్నారు. జీపీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీలో సీఐటీయూ, ఏఐటీయూసీ, టీజీకేబీయూ, ఐఎఫ్ టీయూ యూనియన్లు ఉన్నాయి.

జేఏసీ చైర్మన్  పాలడుగు భాస్కర్, జనరల్ సెక్రటరీ నారాయణ మాట్లాడుతూ గత తొమ్మిదేండ్లుగా పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్లే  సమ్మె నోటీసు ఇచ్చామని వారు చెప్పారు. కొత్త కార్మికులను నియమిస్తలేరని, మల్టీపర్సస్  విధానం అమలు చేస్తలేరని, కనీస వేతనం,ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయడం లేదన్నారు.