- ప్రతి పంచాయతీకి రూ.25 లక్షలు ఇవ్వాలి
- తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించాలని, గ్రామాలకు దక్కే స్టాంప్ డ్యూటీ, మైనింగ్ ఫీజులను తిరిగి పంచాయతీలకే కేటాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షుడు పూసులూరి నరేంద్ర, అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.
శుక్రవారం హైదరాబాద్ లక్డీకపూల్ లోని తెలంగాణ పంచాయతీరాజ్చాంబర్ ఆఫీసులో మీడియాతో వారు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో తెచ్చిన చట్టంతో గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ, ఇసుక, గ్రావెల్, మైనింగ్ ద్వారా వచ్చిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ఖజానాకు మళ్లించిందని, ఇది గ్రామీణ ప్రజలకు చేసిన అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించి పంచాయతీ నిధులను తిరిగి పంచాయతీలకే ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని, గ్రామాల అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రతి పంచాయతీకి రూ.25 లక్షల నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నందున, రాష్ట్ర బడ్జెట్ లో 50 శాతం నిధులు గ్రామాలకే కేటాయించాలన్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు నేటికీ సొంత భవనాలు లేవని, వాటికి వెంటనే స్థలం కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా వేధించిందని, ఇప్పుడు అదే పార్టీ నేతలు పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
