రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి

ఆమనగల్లు, వెలుగు: రూ.20 వేలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్  పంచాయతీ కార్యదర్శి శరత్​కుమార్​ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ రంగారెడ్డి డీఎస్పీ ఆనంద్ కుమార్  తెలిపిన వివరాల ప్రకారం.. వెల్జాల్  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తల్లి పేరిట గ్రామంలో పాత ఇల్లు ఉన్న స్థలం కొని మ్యుటేషన్  చేయించుకున్నాడు.

 అందులో కొంత భాగాన్ని అమ్మేందుకు వాల్యూవేషన్, నో డ్యూ సర్టిఫికెట్, స్థలం ఆన్ లైన్  చేయాలని పంచాయతీ కార్యదర్శి శరత్ కుమార్ ను సంప్రదించగా, రూ.30 వేలు డిమాండ్​ చేశాడు. అంత ఇచ్చుకోలేనని రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకొని కేసు నమోదు చేశారు.

బూర్గంపహాడ్​లో సబ్​ రిజిస్ట్రార్​ డ్రైవర్​ అరెస్ట్..

భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్​ సబ్​ రిజిస్ట్రార్​ డ్రైవర్​ ఫహీంను ఏసీబీ అధికారులు మంగళవారం ఖమ్మం బస్టాండ్​ ప్రాంతంలో అరెస్ట్  చేశారు. సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​లో గత నెల 6న ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్​ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్​ చేయించుకున్న వారి నుంచి సబ్​ రిజిస్ట్రార్​ ఎస్కే ఖదీర్​ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలడంతో గతంలోనే అరెస్ట్​ చేశారు. 

సదరు సబ్​ రిజిస్ట్రార్​ షబానా అనే మహిళతో పాటు డ్రైవర్  అబ్దుల్​ ఫహీంను ప్రైవేట్​గా పెట్టుకున్నారు. వీరిద్దరూ రిజిస్ట్రేషన్​ చేయించుకున్న వారి వద్ద డబ్బులు తీసుకొని ఖదీర్​కు ఇచ్చేవారు. వారి అకౌంట్ల నుంచి రూ.3 లక్షల వరకు ట్రాన్సాక్షన్స్​ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.