గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయం:పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయం:పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

వెంకటాపూర్ (రామప్ప)/  ములుగు, వెలుగు : గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నందిపహాడ్ గొత్తికోయ గ్రామాన్ని అడమా మద్ధతుతో నిర్మాన్ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకొని పలు అభివృద్ధి పనులు చేపట్టారు.

స్వచ్ఛమైన తాగునీటి కోసం బోర్వెల్, వాటర్ ట్యాంక్, 4 కమ్యూనిటీ టాయిలెట్లు, షెడ్, 10 వీధి లైట్లు, జంతువుల కోసం 2 నీళ్ల ట్యాంకులు, 20 కుటుంబాలకు లైటింగ్ ఏర్పాటు చేయగా, కలెక్టర్ దివాకర, ఓఎస్డీ మహేశ్ బాబా సాహెబ్ గీతేతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడంలో దాతల సహకారం ఎంతో గొప్పదన్నారు. ఇటీవల తాడ్వాయి మండలం తక్కలపాడులో స్కూల్​నిర్మించాలని కోరగా, కలెక్టర్, ఎస్పీ స్పందించి 15 రోజుల్లో పూర్తి చేశారని గుర్తు చేశారు.

జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికారుల సహకారం మర్చిపోలేనిదన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మరుగుదొడ్ల వాడకం, తాగునీటి వాడకం, తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, దీనిపై త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు.  

నిర్మన్, ఆడమా  స్వచ్ఛంద సంస్థల యజమానులు అనిల్, నిఖిల్ మాట్లాడుతూ నిరుపేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ఎంచుకున్నామన్నారు. కోయ ప్రజలకు ఏమేమి కావాలో గ్రామసభలో తీర్మానం చేసుకొని నిర్మించామన్నారు. కార్యక్రమంలో నిర్మాన్, అడమా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, డీఎస్పీ రవీందర్​, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభాగ్యులకు అండగా సీఎంఆర్​ఎఫ్

ములుగు: అభాగ్యులకు సీఎంఆర్​ఎఫ్​అండగా ఉంటుందని పంచాయతీరాజ్​శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు క్యాంపు కార్యాలయంలో 25మంది లబ్ధిదారులకు, తాడ్వాయి మండలం మేడారంలో సైతం 9 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.16 లక్షల విలువగల చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు 
పాల్గొన్నారు.