
పండిత మదన్ మోహన్ మాలవ్య హిందూ సంప్రదాయాలు, మత ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించాడు. హిందూత్వాన్ని చూసే, అనుసరించే విధానంలో ఆయనకు, మిగతా ఉన్నత శ్రేణి జాతీయ నాయకుల మధ్య ముఖ్యమైన తేడా ఉంది. మాలవ్య లాగ మతాన్ని పాటించేవారు ఎవరూ కనిపించరు. అంతేకాకుండా జాతీయ వ్యవహారాల్లో ఆయన గొప్ప అభ్యుదయవాది. అందువల్లే ఆయనలో అంతర్గతంగా హిందూ సంప్రదాయానికి, జాతీయవాదానికి మధ్య ఘర్షణ చెలరేగుతుండేది.
మాలవ్య అంటరానితనం నిర్మూలన కోసం ముందుండి పోరాడాడు. ఈ విషయంలో ఆయన గాంధీజీతో ఏకీభవించాడు. అలాంటి ఆచారం అసలు హిందూ ధర్మంలో, ఏ ధర్మ శాస్త్రంలో లేదన్నాడు. చారిత్రాత్మకంగా చూసినా సంస్కృత కాలంలో కూడా లేదన్నాడు. అందుకే ఈ ఆచారాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలి అనేవాడు. వేరే మతంలోకి మారిన ఎంతోమందిని తిరిగి హిందూ మత విశ్వాసంలోకి తీసుకొచ్చాడు. అంతేకాదు.. ఆయన నిరాడంబరతకు ప్రతిరూపం. దాదాపు రుషులు తినేటటువంటి భోజనం చేసేవాడు. వివాహానికి అత్యంత పవిత్రతను ఆపాదించేవాడు. ప్రాచీన బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో చెప్పడానికి ఆయనే చక్కని ఉదాహరణ. అయితే.. అనుకోకుండా ఎదురయ్యే కొన్ని విపత్కర పరిస్థితుల్లో మాత్రం తన కఠిన సనాతన సంప్రదాయాలను పక్కన పెట్టి నిషిద్ధ మార్గాల్లో వెళ్లేందుకు కూడా ఎల్లప్పుడూ ముందుండేవాడు. అలాంటి ముందడుగే ఆయన సముద్రాన్ని దాటి వెళ్లి ఇంగ్లాండ్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కావాలని తీసుకున్న నిర్ణయం.
గాంధీజీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయన మనసు దానిని పూర్తిగా అంగీకరించలేకపోయింది. అలాగని కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లడానికి ఇష్టపడలేదు. అందుకే కాంగ్రెస్ సెషన్లలో పదే పదే తన వాణిని వినిపించాడు. కానీ.. మిగతావాళ్ల ధోరణిని మార్చలేకపోయాడు. వాళ్లు కూడా ఆయన ఆలోచనని మార్చలేకపోయారు. అయినా ఎవరూ క్షణ కాలమైనా ఆయన విధేయతను, ధైర్యాన్ని ప్రశ్నించలేదు. చివరికి ఇతరులతోపాటే మాలవ్య కూడా జైలుకు వెళ్లాడు. ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా గాంధీజీ బలపరిచినంత హృదయపూర్వకంగా బలపరచలేకపోయాడు. ఆ తర్వాత సీఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ సహాయ నిరాకరణోద్యమం నుంచి విడిపోయి కౌన్సిల్‌లోనే పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం అందరికన్నా మాలవ్యాని ఎక్కువ ఆనందింపజేసింది.
మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీ నేతగా ఎన్నికల్లోకి వచ్చినప్పుడు అందరూ మాలవ్య కూడా ఆ పార్టీలో చేరతాడు అనుకున్నారు. కానీ.. అందుకు బదులుగా ఆయన సొంతంగా ‘నేషలిష్ట్ పార్టీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. లాలా లజపతిరాయ్ ఆయనకు అత్యంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా ఉన్నాడు. మాలవ్య బెనారస్‌లో హిందూ విశ్వ విద్యాలయం ఏర్పాటు కోసం దేశంలోని ధనిక వర్గాన్ని ప్రభావితం చేసి విరాళాలు ఇప్పించాడు. యూనివర్సిటీ స్థాపనలో ముఖ్యపాత్ర పోషించాడు. సహాయ నిరాకరణోద్యమం నాటి నుంచి ఆయన ఎన్నో సార్లు జైలుకు వెళ్లాడు. ఎన్నోసార్లు శిక్షలు పడ్డాయి. అయినా.. ఏ సందర్భంలోనూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. జాతీయ సేవ విషయంలో ఎంతో గొప్ప అంకిత భావం ఆయనది. అదే ఆయనను సమకాలీన దేశ నాయకుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. లక్షలాది మంది హృదయాలను గెలుచుకునేలా చేసింది. ఆయన మాతృదేశం కోసం చేసిన త్యాగాలు, హిందూ మత విశ్వాసం అందరికీ తెలుసు.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత