ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

 ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ఎస్‌‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌‌ రావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఉదయం చంచల్ గుడా జైలు నుండి ప్రణీత్ రావును  పంజాగుట్ట పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో ప్రణీత్ రావును విచారించి.. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కీలక విషయాలతోపాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరించనున్నారు. విచారణలో ప్రణీత్‌‌ రావు వెల్లడించే వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ :- కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ

కాగా,  గత ప్రభుత్వ హయాంలో ఎస్‌‌ఐబీలో విధులు నిర్వహిస్తూ ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేసిన కేసులో ఈ నెల 12న ప్రణీత్‌‌ రావును అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు..  నాంపల్లి కోర్టులో హాజరపర్చారు.  కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఎస్‌‌ఐబీ లాగర్ ఆఫీస్‌‌ లో హార్డ్‌‌ డిస్క్‌‌ల మార్పిడి, ధ్వంసం, డేటా ట్రాన్స్‌‌ఫర్‌‌ సహా ఫోన్‌‌ ట్యాపింగ్‌‌కు సంబంధించిన సమాచారం రాబట్టాలని కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టు మాత్రం వారం రోజులు మాత్రమే కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది.