పపువా న్యూ గినియా మరోసారి భారీ భూకంపంతో వణికిపోయింది. భారత కాలమానం ప్రకారం.. ఈ వేకువ ఝామున 4 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సముద్ర తీరంలోని వెవాక్ పట్టణానికి 97 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
భూఅంతర్భాగంలో 62 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని USGS పేర్కొంది. భారీ భూకంపం సంభవించినప్పటికీ సునామీ (Tsunami ) వచ్చే ప్రమాదమేమీ లేదని వెల్లడించింది. భూకంప సంభవించిన ప్రాంతంలో పెద్దఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలిపింది. భూకంపం సంభవించిన ప్రాంతం ఇండోనేషియా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉందని వివరించింది.
మొత్తని నేల స్వభావం వల్ల.. భూకంపం సంభవించిన ప్రాంతంలో నష్టం భారీగానే కలిగే అవకాశముందని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. అయితే.. సునామీ సంకేతాలు లేకపోవడం వల్లే హెచ్చరిక జారీ చేయలేదని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. తరచూ భూకంపాలతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
భూకంప కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలోని హైలాండ్ ప్రావిన్స్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు 45 సెకండ్లపాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో ఒకటిగా ఉన్న పపువా న్యూ గినియా.. బయోడైవర్సిటీకి ఫేమస్. అక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. భూకంపాలు సంభవించిన సమయంలో కొండచరియలు విరిగి పడడం ద్వారా భారీగా నష్టం జరుగుతుంది.
గత ఏడాది సెప్లెంబర్‌లో.. 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం 21 మంది బలి తీసుకుంది. 2018లో సంభవించిన భూకంపం ఏకంగా 200 మందిని పొట్టనబెట్టుకుంది. వీళ్లలో కొండచరియల కింద నలిగి మరణించిన వాళ్లే అధికం.
