పరకాల, వెలుగు: పరకాలలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని వెల్లడించారు. శుక్రవారం పరకాల పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ సతీశ్‌బాబు కేసు వివరాలను వెల్లడించారు.
నడికూడ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ షరీఫొద్దీన్, భార్య అజీరాబేగంతో కలిసి పరకాల పట్టణంలోని సాగరవీధిలో అద్దెకు ఉంటున్నారు. పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పనిచేసే జట్టబోయిన సందీప్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో పలుమార్లు ఇంటి వద్దకు టిఫిన్లు తీసుకురావాలని సందీప్‌ను పంపుతుండటంతో అతనికి అజీరాబేగంతో పరిచయం ఏర్పడి, అక్రమ సంబంధానికి దారితీసింది.
ఈ నెల 2న సందీప్, షరీఫొద్దీన్ వెల్లంపల్లి రోడ్డుకు వెళ్లి మద్యం సేవించారు. ఆ సమయంలో వివాహేతర సంబంధం విషయం ప్రస్తావనకు రావడంతో సందీప్ కర్రతో షరీఫొద్దీన్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించేందుకు డెడ్‌బాడీని బైక్‌పై ప్రధాన రహదారికి తరలించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సందీప్ ను విచారించగా నేరం ఒప్పుకున్నాడు. శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
