న్యూఢిల్లీ: టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పోస్ట్ మరోసారి హైదరాబాదీనే వరించనుంది. హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి పని చేసి తన పదవీకాలాన్ని ముగించుకున్న ఆర్. శ్రీధర్ స్థానంలో నగరానికే చెందిన టీకే దిలీప్ టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సెలెక్ట్ అయ్యాడు. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌ను కొనసాగించిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ).. బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రేకు అవకాశం ఇచ్చింది. ఇండియా–ఎ, హైదరాబాద్ రంజీ టీమ్‌కు పని చేసిన 39 ఏళ్ల దిలీప్ చివరగా శ్రీలంక టూర్‌కు వెళ్లిన ధవన్ కెప్టెన్సీలోని ఇండియా టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. ఆ టూర్‌లో హెడ్ కోచ్‌గా ఉన్న ద్రవిడ్.. హైదరాబాదీ పనితీరును మెచ్చాడు. పైగా, ఇండియా–ఎ టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన అనుభవం దిలీప్‌కు ఉంది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లిన ఎ–టీమ్‌తో పని చేశాడు. వరంగల్‌లో పుట్టిన దిలీప్ ఆల్‌రౌండర్‌గా హెచ్‌సీఏ తరఫున లీగ్స్‌లో పోటీ పడ్డాడు. ఎ–డివిజన్ లోకల్ లీగ్స్‌లో కాంటినెంటల్ క్లబ్, చీర్‌ఫుల్ క్లబ్, న్యూబ్లూస్ తరఫున ఆడాడు. అయితే, 2004లో బీసీసీఐ లెవెల్1 కోచింగ్ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. హెచ్‌సీఏ అండర్–14 కోచ్‌గా కోచింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. అనంతరం డెక్కన్ చార్జర్స్ సపోర్ట్ స్టాఫ్‌లోకి వచ్చాడు. ఇక, హైదరాబాద్ రంజీ టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేస్తున్న టైమ్‌లో ఇండియా–ఎ టీమ్‌కు పని చేసే చాన్స్ దిలీప్‌కు దక్కింది. 2018లో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లిన ఇండియా–ఎ టీమ్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వెళ్లాడు. కాగా, ద్రవిడ్‌కు సన్నిహితంగా ఉన్న ఎన్‌సీఏ ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ నుంచి దిలీప్‌కు గట్టి పోటీ ఎదురైంది. కానీ, అభయ్ సేవలు ఎన్‌సీఏకు అవసరమని బీసీసీఐ పెద్దలు, సీఏసీ భావించడంతో దిలీప్ గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. ఈ నెల 17 నుంచి కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో కొత్త సపోర్ట్ స్టాఫ్ తమ పని ప్రారంభించనుంది. ద్రవిడ్ అండ్ కో ఫస్ట్ టీ20 జరిగే జైపూర్‌కు శుక్రవారమే బయల్దేరనుంది.
