దేశ రాజధాని పొల్యూషన్ తో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోవటంతోపాటు పొగ మంచు వల్ల స్వచ్ఛమైన గాలి లేకుండా పోయింది. దీంతో జనం కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణం కంటే 60 రెట్లు ఎక్కువగా పొల్యూషన్ నమోదు అవుతుందని.. ప్రభుత్వం మాత్రం ఎయిర్ క్వాలిటీని తక్కువ చేసి చూపిస్తుందంటూ.. 2025, నవంబర్ 10వ తేదీ ఢిల్లీలో జనం నిరసనలకు దిగారు.
మాకు ఊపిరి ఆడటం లేదు.. ఊపిరి పీల్చుకోవటానికి సాయం చేయండి అంటూ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర నిరసనకు దిగిన తల్లిదండ్రులు, పిల్లలను సైతం అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత విషయంలోనూ ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని.. తక్కువ చేసి చూపిస్తుందని.. గాలి నాణ్యతను లెక్కించే మెషీన్ల దగ్గర వాటర్ చల్లుతూ మాయ చేస్తుందని క్లీన్ ఎయిర్ నిరసనకు వచ్చిన జనం అంటున్నారు.
ఎయిర్ పొల్యూషన్ పై ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు.. ప్రైవేట్ సంస్థలు ఇస్తున్న లెక్కల్లో చాలా తేడా ఉండటంపైనా జనం ఆగ్రహంతో ఉన్నారు. పొల్యూషన్ లెవల్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవటంతో స్కూళ్లకు రెండు రోజులు సెలవులు ఇచ్చారు.
►ALSO READ | ఢిల్లీలో గ్యాంగ్ ఆఫ్ థార్స్ అరాచకం.. చెరువులో ఆటలు.. తిక్క కుదిరింది అంటున్న పబ్లిక్ !
పొల్యూషన్ కారణంగా చాలా మంది జ్వర బారిన పడుతుండగా.. మరికొంత మంది కళ్లకు సంబంధించిన సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్నారు. మరికొంత మంది శ్వాశకోశ వ్యాధులు.. ఆస్తమా, ఎలర్జీలతో ఇబ్బంది పడుతున్నారు. దీపావళి తర్వాత నుంచి రోజురోజుకు ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోవటంపై ఢిల్లీ జనంలో ఆగ్రహం, ఆవేదన వ్యక్తం అవుతుంది. కృత్రిమ వర్షాలతో కాలుష్యం కంట్రోల్ చేద్దామని.. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యారు. దీపావళి, ఛాత్ పండుగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం కొత్త రికార్డులు సృష్టిస్తూ.. రోజు రోజుకు అధికం అవుతుంది.
ఢిల్లీలో పొల్యూషన్ దెబ్బకు చాలా మంది సిటీ వదిలిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 3 కోట్ల మంది ఉన్న ఢిల్లీ జనం.. వాయు కాలుష్యంతోపాటు యమునా నది కాలుష్యంతోనూ తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
