ఢిల్లీలో థార్ గ్యాంగ్ ఒకటి బయలుదేరింది. ప్రతి వీకెండ్ వందల కార్లతో బార్లు తీరుతూ పొలాలు, చెరువులు, కుంటలు, ఇసుక, బురద ప్రాంతాల్లో పోటీలు నిర్వహిస్తూ గందరగోళం చేస్తున్నారు. సినిమాలో విలన్స్ కాన్వాయ్ వెళ్లినట్లు కొన్ని సార్లు స్థానికులను భయపెడుతూ అతివేగంగా వెళ్తూ చిరాకు తెప్పిస్తున్నారట.
ఆదివారం (నవంబర్ 09) పదుల సంఖ్యలో మహింద్రా థార్స్ బయలు దేరీ పోటీలు నిర్వహించారు. ఆరావళి రూట్ లో గుర్గాం, ఫరీదాబాద్ ఏరియాల్లో ప్రతి వీకెండ్ నిర్వహించినట్లే కార్ల పోటీలు నిర్వహించారు. స్పీడ్ పోటీలు, నీళ్లు, రాళ్లలో నుంచి కార్లను డ్రైవ్ చేస్తూ చిన్నపాటి కాంపిటీషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఒక థార్ కారు మునిగిపోవటంతో వాళ్ల ఆటలకు బ్రేక్ పడింది.
ఓవర్ స్పీడ్ లో చెరువు దాటేందుకు ప్రయత్నించి థార్ మునిగిపోయింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తృటిలో అపాయాన్ని తప్పించుకున్నాడు. ఆతర్వాత నాకేం కాలేదు.. నేను సేఫ్ గా ఉన్నానని నీళ్లలో నుంచి బయట ఉన్నవాళ్లకు చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.
►ALSO READ | ఒక్క మగాడికి.. ఒక్క భార్యనే.. ఇద్దరు భార్యలుంటే జైలు : కొత్త చట్టం తెచ్చిన అసోం ప్రభుత్వం
అయితే నీళ్లలో మునిగిన మహింద్ర థార్ ను లాగేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరికి థార్ ను మరో థార్ తో లాగారు. 1700 నుంచి 1845 కిలోల బరువుండే SUV థార్.. మరో థార్ తో లాగే ప్రయత్నం చేసి ఎలాగోలా చివరికి నీళ్లలో నుంచి బయటకు తీశారు.
ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న డ్రైవర్లు:
థార్ గ్యాంగ్ ఢిల్లీ NCR రీజియన్ లో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలలో ఒక థార్ డ్రైవర్.. గుర్గాం లోని సదర్ బజార్ లో ప్యాసెంజర్లు ఫుట్ పాత్ పైన ఉన్నప్పటికీ.. మూవింగ్ వెహికిల్ నుంచి యూరిన్ పోయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
థార్, బుల్లెట్ డ్రైవర్లు రోగ్స్ అంటూ.. ఇటీవలే హర్యానా డీజీపీ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. రోడ్లపై యాక్సిడెంట్స్ కు కారణం అవుతన్నారని చేసిన వ్యాఖ్యల తర్వాత.. థార్ గ్యాంగ్ చేసిన అరాచకం బయటకు రావడం గమనార్హం. ఇలాంటి ప్రాణాంతక ఆటలు ఆడుతున్న వారిని రోగ్స్ అనక మరేం అంటారని స్థానికులు డీజీపీకి సపోర్ట్ చేస్తున్నారు.
