
మౌలిక సదుపాయలు, అధ్యాపకులు లేరనే కారణంతో రాష్ట్రంలో గుర్తింపు రద్దు చేసిన 3 మెడికల్ కాలేజీల్లోని వందలాది మంది ఎంబీబీఎస్, పీజీ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను కలిశారు విద్యార్థుల తల్లిదండ్రులు. వెంటనే పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా వారందరినీ రీ అలకేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ .. డీఎంఈ రమేశ్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. రెండ్రోజుల్లో కేంద్రమంత్రిని కలిసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలోని ఎమ్మెన్నార్, టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికిగానూ 450 మంది ఎంబీబీఎస్ 113 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారని తెలిపారు. అయితే మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు లేరనే కారణంతో ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతో తమ పిల్లల భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిందని వాపోయారు. దీంతో తాము నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ని కలిసి న్యాయం చేయాలని కోరామన్నారు. సానుకూలంగా స్పందించిన ఎన్ఎంసీ ఆ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులందరినీ మెరిట్ ఆధారంగా ఇతర మెడికల్ కాలేజీల్లో జాయిన్ (రీఅలకేట్) చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.
అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామన్నారు. తమ పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం విద్యార్థులను రీఅలకేట్ చేయాలని ఆదేశిస్తూ 4 వారాల గడువు విధించిందన్నారు. ఇప్పటికి రెండు వారాలు గడిచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు విద్యార్థుల తల్లిదండ్రులు.