కొల్లాపూర్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడిన ప్రమదం నుంచి విద్యార్థులు తృటిలో తప్పించుకున్నారు. శిథిలావాస్థకు చేరిన పాఠశాల దుస్థితిపై శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘం, సీపీఎం నాయకులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు.
దాదాపు 80 ఏండ్ల కింద నిర్మించిన ఈ పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి వర్షపు నీరు చేరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయమై పలుమార్లు విన్నవించినా సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పిల్లల ప్రాణాలకు, చదువులకు గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడికి చేరుకున్న ఎంఈఓను నిలదీశారు. నూతన భవనం నిర్మించే వరకు విద్యార్థులను సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎంఈఓ, సర్పంచ్, గ్రామస్తులతో కలిసి తాత్కాలికంగా తరగతులు నిర్వహించడానికి గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు అశోక్, సీపీఎం నాయకుడు కాశన్న, గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
