
- ఉక్రెయిన్‌లో చిక్కుకున్న పిల్లలు.. తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
- కంటి మీద కునుకులేకుండా ఎదురు చూపులు
- ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వాలకు వేడుకోలు
- ట్విట్టర్లో మంత్రులకు ట్వీట్‌లు, రిక్వెస్ట్ లెటర్లు
హైదరాబాద్, వెలుగు: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన స్టూడెంట్స్ గురించి గ్రేటర్ సిటీలోని పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. నిన్నటి వరకు ఎక్కడోళ్లు అక్కడ ఉన్న పిల్లలు శుక్రవారం బంకర్లలోకి షిఫ్ట్ అవడంతో ఆందోళన పెరిగిపోయింది. ఎలా ఉన్నారో, తిన్నారో లేదో అని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. వీడియో కాల్స్‌లో మాట్లాడుతూ తల్లడిల్లిపోతున్నారు. బంకర్లలో సౌకర్యాలు లేవని, తినడానికి ఏం దొరకట్లేదని పిల్లలు చెబుతుండడం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమ బిడ్డలను ఇంటికి చేర్చాలని వేడుకుంటున్నారు. మంత్రులు, ప్రభుత్వాలకు ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నారు. అటు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన స్టూడెంట్స్ కూడా సోషల్ మీడియా ద్వారా తమ పరిస్థితిని తెలియజేస్తూ సాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. టీవీలు, సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు చూసి బంధువులు, ఫ్రెండ్స్ బాధిత తల్లిదండ్రుల వద్దకు వచ్చి ధైర్యం చెబుతున్నారు.
దేశం కాని దేశం పంపిస్తే..
సిటీకి చెందిన చాలా మంది స్టూడెంట్లు ఉక్రెయిన్‌లో చదువుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం స్టార్ట్ చేసిందని తెలిసినప్పటి నుంచి పేరెంట్స్‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఉన్నత చదువుల కోసం పిల్లలను దేశం కాని దేశం పంపిస్తే ఇలా జరగడం ఏంటని తల్లడిల్లిపోతున్నారు. తమ పిల్లలను సురక్షితంగా ఇండియాకు తీసుకురావాలని లీడర్లను, ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. తన కూతురు కందుకూరి శ్రీవైష్ణవి ఎంబీబీఎస్ చేసేందుకు ఉక్రెయిన్ వెళ్లిందని, విన్నిట్సియా సిటీలోని నేషనల్ పిరిగోవ్ మెడికల్ యూనివర్సిటీలో థర్డ్ఇయర్ చదువుతోందని కాప్రా మండలం జమ్మిగడ్డకు చెందిన ఆమె తల్లి సవిత చెప్పింది. తన బిడ్డను క్షేమంగా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతోంది. తన కూతురుతో పాటు అక్కడ చిక్కుకుపోయిన స్టూడెంట్లను తీసుకురావాలని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేసింది. సికింద్రాబాద్‌కి చెందిన అనీలా ఆరేళ్ల కింద ఉక్రెయిన్‌కి వెళ్లింది. శుక్రవారం ఉదయం తాను ఉంటోన్న అపార్ట్మెంట్ సమీపంలో బ్లాస్టింగ్ జరిగిందని అనీలా పేరెంట్స్‌కు ఫోన్లో తెలిపింది. బ్లాస్టింగ్ జరిగిన వెంటనే ఆమెతోపాటు అదే అపార్ట్మెంట్లోని స్టూడెంట్స్ అంతా బ్యాగుల్లో ఫుడ్ సర్దుకొని సమీపంలోని బంకర్లోకి వెళ్లినట్లు వివరించింది. బంకర్లో ఎలాంటి సౌకర్యాలు లేవని అనీలా చెప్పిందని ఆమె తండ్రి మనోహర్ బాధపడుతున్నాడు. శంషాబాద్ పరిధి మధురానగర్ కాలనీకి చెందిన అనంతయ్య, మల్లమ్మ చిన్నకూతురు కోరె నిషారాణి మెడిసిన్చదివేందుకు నాలుగేళ్ల కింద ఉక్రెయిన్ వెళ్లింది. నిషారాణి తన ఫెండ్స్‌తో కలిసి అక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో పంపింది. దాన్ని చూసిన తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
ఎప్పుడు ఏం జరుగుతుందో..
ఉక్రెయిన్ లోని భయానక పరిస్థితులను పిల్లలు తమ తల్లిదండ్రులకు వీడియో కాల్ద్వారా చెబుతున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ, గవర్నమెంట్ స్పందించి వీలైనంత త్వరగా తమను ఇండియాకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. అయితే అక్కడి వాతావరణం చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో అర్థం కావట్లేదని పేరెంట్స్ అంటున్నారు.
మెట్రో స్టేషన్ కింద తల దాచుకుంది
మా అమ్మాయి సింధుప్రియ 2019లో ఉక్రెయిన్ వెళ్లింది. తాను ఉంటున్న ఏరియాకు దగ్గర్లోనే యుద్ధం జరుగుతోంది. బాంబుల శబ్దంతో భయపడుతున్నామని సింధు చెప్పింది. శుక్రవారం పొద్దుట్నుంచి ఏం తినలేదని వీడియో కాల్లో బాధపడింది. ఫ్రెండ్స్‌తో కలిసి మెట్రో స్టేషన్ కింద తలదాచుకున్నామని చెప్పింది. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా కూతుర్ని సురక్షితంగా తీసుకురావాలి.
- మధుకర్ గౌడ్, శ్రీసాయినగర్ బ్యాంక్ కాలనీ, పీర్జాదిగూడ