
- కరోనా పూర్తిగా కంట్రోల్ అయ్యాకే బడికి
- ఆర్నెల్ల దాకా ఆటలు, పార్టీలు బంద్
- మెజారిటీ పేరెంట్స్ అభిప్రాయం
- ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తేనే పార్కుల్లో ఆటలు
- పేరెంట్ సర్కిల్ ఆన్లైన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: లాక్డౌన్ ఎత్తేశాక స్కూళ్లు స్టార్ట్ అయినా సరే కరోనా పూర్తిగా కంట్రోల్ అయ్యాకే పిల్లలను స్కూలుకు పంపిస్తామని పేరెంట్స్ చెబుతున్నారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా 92 శాతం పేరెంట్స్ ఇదే ఉద్దేశంలో ఉన్నారని ఈమధ్య జరిపిన సర్వేలో తేలింది. స్కూళ్లు తెరిచిన వెంటనే కాకుండా కొంతకాలం చూసి, ఆ తర్వాతే బడికి పంపిస్తామని చాలామంది అంటున్నారట. బర్త్ డే పార్టీ, కలిసి ఆడుకోవడం.. ఇలా కారణమేదైనా పిల్లలను బయటికి పంపించేది లేదని ఖరాఖండీగా చెబుతున్నారట. లాక్ డౌన్ తర్వాత పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారనే విషయంపై దేశవ్యాప్తంగా 12 వేల మంది పేరెంట్స్ ను ఆన్లైన్లో సర్వే చేసి పేరెంట్ సర్కిల్ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ.. వంటి సిటీలలోని పేరెంట్స్ ను ప్రశ్నించినట్లు తెలిపింది.
అకడమిక్ ఇయర్‌పై ఎఫెక్ట్..
వైరస్ వ్యాప్తి వల్ల మార్చిలో స్కూళ్లు మూతపడడం అకడమిక్ ఇయర్ పై చాలా ప్రభావం చూపింది. పిల్లల చదువులపైనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్లో పరీక్షలు పెట్టలేక తొమ్మిదో తరగతి వరకు స్టూడెంట్లు అందరినీ స్కూళ్లు ప్రమోట్ చేశాయి. ఇప్పుడు వచ్చే అకడమిక్ ఇయర్ కోసం స్కూళ్లు తిరిగి తెరుచుకోవాల్సిన టైం దగ్గరపడుతోంది. లాక్ డౌన్ఎత్తేస్తే స్కూళ్లు తెరిచేందుకు మేనేజ్మెంట్స్ రెడీగా ఉన్నాయి. అయితే, పిల్లలను పంపించేందుకు పేరెంట్సే సిద్ధంగా లేరు. ఓ వైపు కరోనా కేసులు బయటపడుతుంటే పిల్లలను స్కూలుకు పంపించే రిస్క్ తీసుకోలేమని వారు అంటున్నారు.
తెరిచిన వెంటనే పంపబోం..
కొత్త అకడమిక్ ఇయర్ కోసం స్కూళ్లు తెరిచీ తెరవంగనే తమ పిల్లలను పంపించబోమని 92 శాతం పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. స్కూళ్లు తెరిచాక కనీసం ఒకనెల గడిచాకే పిల్లలను పంపిస్తామని 56 శాతం మంది చెప్పారు. కేవలం 8 శాతం మంది పేరెంట్స్ మాత్రమే తమ పిల్లలను వెంటనే స్కూలుకు పంపేందుకు రెడీ అన్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించినా సరే ఈ ఏడాదిలో పిల్లలను బర్త్ డే పార్టీలకు పంపించేది లేదని 64 మంది పేరెంట్స్ చెప్పారు. పిల్లలను వెంటేసుకుని మాల్స్, మూవీస్ లకూ వెళ్లబోమని చెప్పగా.. కేవలం 1 శాతం పేరెంట్స్ మాత్రమే థియేటర్లు తెరవంగనే సినిమాకు వెళతామన్నారు.
ఆటలపై ఆలోచించలే..
మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేందుకు తమ పిల్లలను పంపించే విషయంలో ఇప్పటి వరకు ఆలోచించలేదని మెజారిటీ పేరెంట్స్ చెప్పారు. అప్పటి పరిస్థితులను బట్టి పంపాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటమని సగం మంది చెప్పగా.. పార్కుల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మిగతా పిల్లలతో ఆడుకునేందుకు ఓకే అని 35 శాతం మంది తెలిపారు. కనీసం ఆరు నెలల పాటు ఆటల్లేవని 45 శాతం మంది పేరెంట్స్ తేల్చేశారు. కేవలం 25 శాతం మాత్రమే తమ పిల్లలను ఆడుకోవడానికి పంపిస్తామన్నారు. సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు ఏదో ఒక హాలిడేకు వెళ్లే వాళ్లు కూడా ఈసారి ఇండ్లల్లోనే ఉంటమన్నారు. వైరస్ కంట్రోల్ అయినా సరే హాలిడే ట్రిప్ పెట్టుకోలేమని చెప్పారు. లాక్డౌన్ ఎత్తేసినా సరే హాలిడే ట్రిప్ కు వెళ్లడం ఇప్పుడంత సేఫ్ కాదని 57 శాతం పేరెంట్స్ అభిప్రాయపడ్డారు.