మా కొడుకును మత్తు నుంచి కాపాడండి..ఈగల్ ఫోర్స్‌‌ కు ఫోన్ చేసి వేడుకుంటున్న పేరెంట్స్‌‌

మా కొడుకును మత్తు నుంచి కాపాడండి..ఈగల్ ఫోర్స్‌‌ కు ఫోన్ చేసి వేడుకుంటున్న పేరెంట్స్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: గంజాయి, డ్రగ్స్‌‌కు బానిసలవుతున్న తమ పిల్లల్లో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు నడుం బిగించారు. డ్రగ్స్‌‌కు బానిసలైన తమ పిల్లలతోపాటు వారి ఫ్రెండ్స్ ను గుర్తించి ఈగల్‌‌ ఫోర్స్‌‌కు సమాచారం అందిస్తున్నారు. వారిని మత్తు నుంచి కాపాడాలని 1908కు కాల్ చేసి వేడుకుంటున్నారు. 1908కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రెండు రోజుల వ్యవధిలో తొమ్మిది మంది మైనర్లను గుర్తించి కౌన్సెలింగ్‌‌ ఇచ్చారు. వీరిలో ఎనిమిది మందిని డీ-అడిక్షన్‌‌ సెంటర్లకు తరలించారు. ఈ వివరాలను ఈగల్‌‌ ఫోర్స్‌‌ డైరెక్టర్ సందీప్ శాండిల్యా గురువారం ఓ ప్రకటనలో  వెల్లడించారు. 

సైబరాబాద్‌‌ కమిషనరేట్‌‌ పరిధిలో ఓ తల్లి 1908కు ఫోన్‌‌ చేసి తన కొడుకు, అతడి స్నేహితులు డ్రగ్స్​కు బానిసలయ్యారని తెలిపింది. స్పందించిన ఈగల్‌‌ ఫోర్స్‌‌ ఓ పెడ్లర్ సహా 8 మందిని అదుపులోకి తీసుకుంది. వీరిలో ఆరుగురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. పరీక్షల్లో వారికి డ్రగ్‌‌ పాజిటివ్‌‌గా తేలడంతో డీ-అడిక్షన్‌‌ సెంటర్‌‌‌‌కు తరలించారు. ఘటనపై జీడిమెట్ల, సనత్‌‌నగర్‌‌ పోలీస్‌‌స్టేషన్‌‌లో కేసులు నమోదు చేసి పెడ్లర్‌‌ను అరెస్టు చేశారు. వనపర్తి జిల్లాలోనూ తల్లిదండ్రులు తమ కుమారుడి విషయంలో ఈగల్‌‌ ఫోర్స్‌‌ టోల్‌‌ఫ్రీ నంబర్‌‌కు కాల్‌‌ చేశారు. గంజాయితో పాటు పలు రకాల డ్రగ్స్‌‌కు బానిసయ్యాడని తెలిపారు. ఆ బాలుడికి పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలడంతో డీ-అడిక్షన్‌‌ సెంటర్‌‌‌‌కు పంపారు.

17 ఏండ్లలోపు పిల్లలే!

ఈ రెండు ఘటనల్లోనూ డ్రగ్స్ తీసుకున్న వారి వయసు 14 నుంచి 17 ఏండ్ల మధ్యేనని ఈగల్ డైరెక్టర్‌‌‌‌ సందీప్ శాండిల్యా వెల్లడించారు. తల్లిదండ్రుల నుంచి ఇటీవల ఫిర్యాదులు పెరుగుతున్నాయని తెలిపారు. మైనర్లలో డ్రగ్స్‌‌ వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.