పెంచాలి.. నవ్వులతో!: అమ్మానాన్నలు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి

పెంచాలి.. నవ్వులతో!: అమ్మానాన్నలు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి

చిన్నపిల్లలతో అమ్మానాన్నలకు ప్రతిరోజూ టెన్షనే. ఎందుకంటే, పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పిల్లలతో ‘ఎప్పుడు, ఎలా ఉండాలి? ఏం చేయాలి?’ వంటి ప్రశ్నలకు ఎప్పటికప్పుడు వాళ్లు జవాబులు వెతుక్కోవాల్సిందే. పైగా ఈ రోజుల్లో పిల్లలు చాలా అటెంటివ్​గా, షార్ప్​గా ఉంటున్నారు. వాళ్లకు అన్ని విషయాలు సులువుగా అర్థం అవుతున్నాయి. అందుకని అమ్మా నాన్నలు ఎంత హ్యూమర్​తో ఉంటే.. పిల్లలు అంత హాయిగా పెరుగుతారు.

‘అమ్మానాన్నలు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి’.. ఈ రోజుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. కానీ, ‘సీరియస్​ విషయాల్లో ఎలా ఫ్రెండ్లీగా ఉండాలి? ఏం చేయాలి?’ అన్నది అమ్మానాన్నల ప్రశ్న. దీనికి నిపుణులు ఒకేఒక్క సలహా ఇస్తున్నారు. అదేంటంటే.. పిల్లలతో ప్రతీ విషయాన్ని నవ్వుతూ, నవ్విస్తూ చెప్పాలని, దీనివల్ల పిల్లల్లో చాలా మార్పులు వస్తాయని కూడా అంటున్నారు.

నవ్వు ఒక మందు : అమ్మానాన్నలకైనా పిల్లలకైనా నవ్వు మంచి ఔషధంగా పని చేస్తుంది. అది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. తరచూ నవ్వడం వల్ల మెదడు ఎండార్ఫిన్స్​ అనే హ్యాపీ హార్మోన్స్​ని విడుదల చేస్తుంది. అలాగే ఈ నవ్వు బ్లడ్​ప్రెజర్​(బీపీ)ని తగ్గించి.. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్ట్రెస్​ తగ్గుతుంది : కొన్నిసార్లు పిల్లల విషయంలో అమ్మానాన్నలు.. చిన్న విషయాలకే సీరియస్​ అవుతుంటారు. దాన్ని సీరియస్​గా తీసుకుని స్ట్రెస్​కి లోనవుతుంటారు. ఆ టైమ్​లో పిల్లలు కూడా యాంగ్జైటీ, స్ట్రెస్​తో ఇబ్బందిపడతారు. అందుకే అమ్మానాన్నలు ఎప్పుడూ పిల్లలతో జోకులు వేస్తూ, నవ్వుతూ సమస్యలను పరిష్కరించుకోవాలి. పైగా కార్టిసొల్​, అడ్రినలిన్​ వంటి స్ట్రెస్​ హార్మోన్స్​ విడుదల కూడా తగ్గుతుంది.

బంధాలు కలుస్తాయి : మనుషుల్లో హెల్దీ, హ్యాపీ రిలేషన్​షిప్​ ఏర్పడేందుకు ఈ హ్యూమర్​ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పిల్లలకు కూడా తమ పేరెంట్స్​తో మంచి రిలేషన్​షిప్​ ఏర్పడుతుంది. దాంతో పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్​తో ఉండటానికి, ఏదైనా విషయం చెప్పుకోవడానికి ఇబ్బందిపడరు.

పిల్లలకు సర్​ప్రైజ్​ : చిన్నప్పట్నించే పిల్లల్లో చిరాకు అనేది మొదలవుతుంది. ముఖ్యంగా కావాల్సిన బొమ్మ దొరకనప్పుడు, వాళ్లకు నచ్చినదాన్ని ఎవరైనా లాక్కున్నప్పుడు చిరాకుపడతారు. అలాంటి టైమ్​లో అమ్మానాన్నలు వాళ్లపై అరవడం, చిరాకు, కోపం తెచ్చుకోకుండా నవ్వుతూ కూల్​ చేయాలి.
ఫన్నీ జోక్స్​ చెప్పి వాళ్లలో ఆ చిరాకు పోగొట్టాలి. దాంతో పిల్లలు బొమ్మల విషయం మర్చిపోయి నార్మల్​ అవుతారు.

పరిస్థితినే మారుస్తుంది : ఈ హ్యూమర్​ ఎలాంటి నెగెటివ్​ పరిస్థితినైనా పాజిటివ్​గా మార్చుతుంది. చాలామంది పిల్లలు అన్ని రకాలు తినడానికి ఇష్టపడరు. అప్పుడు అమ్మానాన్నలు పిల్లలు నోరు తెరవట్లేదని చెంచా, గిన్నె పక్కనబెట్టి అరుస్తుంటారు.
అలా ఎప్పుడూ చేయకూడదు. చిన్న చిరునవ్వుతో పిల్లలకు నచ్చిన విషయాలు మాట్లాడుతూ
తినే ఆసక్తిని కల్పించాలి. అలా నెగెటివ్​ సిచ్యువేషన్​ని ఫన్నీగా, పాజిటివ్​గా మార్చాలి.

‘సెన్సాఫ్​ హ్యూమర్​’ : ఇంట్లో ప్రతి సందర్భంలోనూ అమ్మానాన్నలు హ్యూమరస్​గా ఉంటే, పిల్లలకూ అదే అలవాటవుతుంది. పిల్లలు ఏ విషయంలో నవ్వితే.. దాన్ని వాళ్లు ఎప్పటికీ మర్చిపోరు. అలాంటి సందర్భాలు ఎప్పుడొచ్చినా, వాళ్లు నవ్వుతారే తప్ప స్ట్రెస్​కి లోనవ్వరు. అలాంటి పిల్లల్లో చిన్న వయసులోనే సెన్సాఫ్​ హ్యూమర్​ పెరుగుతుంది. వాళ్లే రివర్స్​లో అమ్మానాన్నలను నవ్వించగలుగుతారు. ఇది వాళ్లలో పాజిటివ్ థింకింగ్​ని క్రియేట్​ చేస్తుంది.​