ఊరికి రోడ్డు కావాలంటే.. రైతు బంధు, పెన్షన్లు వదులుకోండి

ఊరికి రోడ్డు కావాలంటే.. రైతు బంధు, పెన్షన్లు వదులుకోండి
  • గ్రామస్తులకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మైండ్ బ్లాక్ సమాధానం

వికారాబాద్ జిల్లా: వర్షాలకు రోడ్డు పాడైపోయింది.. బాగు చేయించమని గ్రామస్తులు అడిగిన ప్రశ్నకు పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇచ్చిన సమాధానంతో గ్రామస్తుల మైండ్ బ్లాంక్ అయింది. తన సమాధానం విని అర్థం కానట్లు గ్రామస్తులు అయోమయంతో.. ఆశ్చర్యపోతున్నట్లు కనిపించడంతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం వద్ద నిధుల్లేవు.. తర్వాత వేయిస్తాలే అంటూ దాట వేస్తూ వేడెక్కిన పరిస్థితి తేలిక చేసే ప్రయత్నం చేశారు. జిల్లాలోని పూడూరు మండలం మైసమ్మగడ్డ తండా గ్రామం వద్ద జరిగిందీ ఘటన.
ఇంతకూ ఆయన చెప్పిందేమిటంటే..
వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం పర్యటించారు పరిగిఎమ్మెల్యే మహేష్ రెడ్డి.  పూడురు అనుబంధ గ్రామమైన మైసమ్మ గడ్డ తాండా వాసులు తమ గ్రామానికి రోడ్డు వేయించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కోరారు. ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని...వర్షం పడితే గ్రామానికి రాకపోకలు ఇబ్బంది అవుతోందని ఎమ్మెల్యే కు గుర్తు చేశారు. అంత పెద్ద మొత్తం నిధులు వచ్చే పరిస్థితి లేదని ఎమ్మెల్యే చెబుతుంటే మరికొందరు రోడ్డు కావాలంటూ బిగ్గరగా అడిగారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే మీ ఊరికి రోడ్డు కావాలంటే రైతు బంధు, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ వదులుకోండి...వెంటనే ఊరికి రోడ్డు వేయిస్తానని బదులిచ్చారు. ఎమ్మెల్యే సమాధానం అర్థం కానట్లు కొద్దిమంది ఆశ్చర్యంగా.. అయోమయంతో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వైపు చూడడంతో ఆయన  ప్రభుత్వం వద్ద  పైసలు లేవు.. మరి ఏం చేయాలే.. అంటూ కామెంట్ చేశారు. తర్వాత వేయిస్తాలే అంటూ దాటవేశారు.