
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తొడగొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే తాము తొడగొడ్తామని బీఆర్ఎస్ ని హెచ్చరించారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. " ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. బీఆర్ఎస్, బీజేపీ నేతలు కనీసం ఏడాదైనా ఓపిక పట్టాలి. జిల్లాల పునర్విభజన అడ్డగోలుగా, అశాస్త్రీయంగా చేశారు. దీనిపై చర్చించేందుకు ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని సీఎం రేవంత్ ను కోరుతున్న" అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కలుగజేసుకుని.." రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నం.
వికారాబాద్‌ను జిల్లాగా చేయాలన్న ఆ ప్రాంత ప్రజల కలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఆ ప్రాంతం జిల్లాగా ఉండడం రామ్మోహన్‌రెడ్డికి ఇష్టం లేదా? " అని ఆమె నిలదీశారు. ఈ విషయంలో వికారాబాద్ ఎమ్మెల్యే అయిన స్పీకర్ స్పందించాలని కోరారు. దీనిపై మంత్రి శీధర్‌బాబు స్పందిస్తూ..స్పీకర్‌ను చర్చలోకి లాగడం సరికాదన్నారు. ఇది సభా నియమాలకు విరుద్ధమన్నారు. అనంతరం మళ్లీ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను వికారాబాద్ జిల్లా ఉండొద్దని అనలేదని తెలిపారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన, జోన్ల విభజన జరిగిందని మాత్రమే చెప్పానని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరించాలని ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను కోరారు. అలాకాకుండా, ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే తాము తొడగొడ్తామని పేర్కొంటూ నిజంగానే తొడకొట్టారు.