
సీఈవోలు, అకౌంట్స్ ఆఫీసర్ల పోస్టుల మంజూరు
కలెక్టర్లకు పీఆర్ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు
కొత్త జడ్పీలకు మండలాల నిష్పత్తి ప్రకారం ఉద్యోగులు, ఆస్తులు వంటివి పాత జడ్పీ పరిధిలోని కలెక్టర్లు పంచాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు కొత్త పాలకవర్గాలు వచ్చే నెల 5 నుంచి రానున్న నేపథ్యంలో విభజనపై గైడ్‌లైన్స్ కూడా జారీ చేశారు. రాష్ట్రంలో జడ్పీలు, మండల పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా జడ్పీపీలు, ఎంపీపీలకు పోస్టులు సిబ్బంది కేటాయింపుపై మార్గదర్శకాలను వీటిలో పేర్కొన్నారు. ఉమ్మడి తొమ్మిది జిల్లా పరిషత్‌ల్లోని పోస్టులను కొత్తగా ఏర్పాటైన 32 జిల్లా పరిషత్‌ల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 23 మంది డిప్యూటీ సీఈలు కొత్త జిల్లాల్లో జడ్పీ సీఈవోలుగా వ్యవహరించనున్నారు. 23 మందికి పదోన్నతులు కల్పించి, బాధ్యతలను అప్పగించాలని అందులో తెలిపారు.
ప్రస్తుతం తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సీఈవోలతో పాటు తొమ్మిది మంది డిప్యూటీ సీఈవోలు కూడా పనిచేస్తున్నారు. ఈ డిప్యూటీ సీఈవోలను కొత్త తొమ్మిది జిల్లాలకు సీఈవోలుగా నియమిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో డిప్యూటీ సీఈవోలుగా ప్రమోషన్ పొందిన వారిని మిగిలిన 14 కొత్త జిల్లాలకు సీఈవోలుగా రీడిప్లయ్ చేస్తూ నియమించాలని సూచించారు. తొమ్మిది జడ్పీల్లో అకౌంట్ ఆఫీసర్లు (ఏవో)గా పని చేస్తున్నందున మిగిలిన 23 జిల్లాల్లో డిప్యూటీ సీఈవోలుగా ప్రమోషన్ పొందిన వారిని ఏవోలుగా నియమించనున్నట్లు వెల్లడించారు. పాత జిల్లా పరిషత్‌లకు మంజూరైన పోస్టలన్నీ (రీ ఆలోకేట్ చేయాల్సినవి మినహాయించి) కొత్త జడ్పీలకు కేటాయించనున్నారు.
నూతన జిల్లాల్లో పని ఒత్తిడి, అవసరాలు, ఇతర అంశాల ప్రాతిపదికన సిబ్బంది సరళిని అనుసరించి జడ్పీల్లో మంజూరైన పోస్టులకు జడ్పీలకు, మండలాల్లో మంజూరైన పోస్టులను మండలాలకు కేటాయించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా రీఅలోకేట్ కాని పోస్టుల్లో ఉన్న ఉద్యోగులంతా కూడా కొత్త జడ్పీల ప్రారంభం నుంచి తమ తమ పోస్టుల్లో ఆయా జడ్పీ కార్యాలయాల్లో కొనసాగనున్నారు. ఇందులో భాగంగా బదిలీలు, కొత్త జిల్లాలు, మండలాలకు తరలించాల్సిన ప్రకారం సాధారణ బదీలలపై ఉన్న నిషేధాన్ని సడలించనున్నారు. కొత్త జడ్పీలకు కేటాయించి సిబ్బంది ఆర్డర్ టూ సర్వ్ కింద నియమితులైన ఉద్యోగులు సీనియార్టీ, పదోన్నతుల సర్వీసుల అంశాల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత ఉమ్మడి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్‌ల్లో పరిపాలనా అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొనసాగుతారు. ఇక జడ్పీల్లో పాత జిల్లా పరిషత్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జిల్లా కలెక్టర్లు, దాని పరిధిలోని కొత్త జిల్లా కలెక్టర్లతో చర్చించి, సొంత ప్రాంతం, మండలం, సీనియార్టీ ప్రాతిపదికన సిబ్బందిని సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు.
ఫర్నీచర్ విభజన
ఇక కుర్చీలు, టేబుల్స్ , స్పీకర్లు, మైక్రో ఫోన్ , యాంప్లీఫైర్ లు కొనుగోలుకు కొత్తగా ఏర్పాటు కానున్న 23 జిల్లా పరిషత్ లకు రూ.14 కోట్ల58 లక్షలను కూటాయించారు. మండల పరిషత్‌లకు సంబంధించి కాంటింజెన్సీ ఖర్చు కోసం రూ.2 కోట్ల 24 లక్షల నిధులను కేటాయించారు. ఫైళ్లు తరలించే సమయంలో జడ్పీ సీఈవో అన్నింటిని విధిగా స్కాన్ చేసి భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.