- పార్లమెంట్ కేవలం చర్చలకు, విధానపర నిర్ణయాలకేనని వ్యాఖ్య
- డ్రామాలు ఆడాలంటే వేరే ప్రదేశాలు చాలా ఉన్నాయి
- ఓటమిని జీర్ణించుకోలేక చట్టసభల్లో అసంతప్తి వెళ్లగక్కుతున్నరు
- పదేండ్లుగా ప్రతిపక్ష సభ్యులు చేస్తున్నది ఇదే.. ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి
- నిర్మాణాత్మకమైన చర్చలకు తాము సిద్ధమని ప్రకటన
- పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఓటమిని అంగీకరించే మనస్తత్వం ప్రతిపక్షాలకులేదని, అందుకే పార్లమెంట్లో చర్చను తప్పుదోవపట్టించేందుకు ప్రతిసారి డ్రామాలు ఆడుతుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఈ డ్రామాలు చేయొద్దని కావాలంటే ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షాలకు టిప్స్ ఇస్తానని మోదీ చెప్పారు. ‘‘పార్లమెంట్లో డ్రామాలకు తావులేదు. కేవలం ప్రజా సమస్యలపై చర్చించేందుకు చోటుంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించాలి.
పదేండ్ల నుంచి ప్రతిపక్షాలు ఆడుతున్న ఆటలను దేశ ప్రజలంతా చూస్తున్నారు. అలాంటి డ్రామాలు ఎట్టిపరిస్థితిలోనూ ఆమోదయోగ్యం కాదు. వాళ్లు ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకోవాలి. కావాలంటే ఎన్నికల్లో ఎట్ల గెలవాలో వాళ్లకు టిప్స్ ఇవ్వడానికి నేను సిద్ధం” అని ఆయన అన్నారు. సోమవారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంట్ఆవరణలో మీడియాతో మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటములను జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు చట్టసభలను వాడుకుంటున్నారని దుయ్యబటారు.
ప్రజా సమస్యలపై చర్చిద్దాం
అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని ప్రధాని మోదీ తెలిపారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ‘‘డ్రామాలు ఆడుకునేందుకు ఇతర ప్రదేశాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్లి నాటకాలు వేసుకోవచ్చు. కానీ, పార్లమెంట్ అనేది చర్చించడానికి, మాట్లాడటానికి మాత్రమే. ఇక్కడ డ్రామాలు అంటే ఎవరూ ఆమోదించరు” అని హెచ్చరించారు.
‘‘నినాదాలు ఇచ్చుకోవడానికి, విమర్శలు చేసుకోవడానికి కూడా పార్లమెంట్లో తావులేదు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడికి వెళ్లి నినాదాలు చేసుకోవచ్చు.. విమర్శలు చేసుకోవచ్చు. ప్రజలే సమాధానం చెప్తారు. నినాదాల కోసం కాదు.. విధానాల కోసం పార్లమెంట్ ఉందనే విషయం గుర్తించాలి. ప్రజల కోసం, దేశాభివృద్ధి కోసం కీలకమైన పాలసీలు తీసుకురావాల్సిన పార్లమెంట్లో వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం స్లోగన్లు ఇవ్వడం కరెక్ట్ కాదు.
మంచి వాతావరణంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని ఆశిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు. ‘‘గెలుపు ఓటములు సహజం. ఎవరైనా సరే ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. బాధ్యతతో మెదలాల్సిందే. ఓడామని ఫ్రస్ట్రేషన్‌కు గురవడం కరెక్ట్ కాదు.. గెలిచామని అహంకారం చూపడానికి తావులేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
