విభజన హామీలపై పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాలి : కేటీఆర్

విభజన హామీలపై పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాలి :  కేటీఆర్

హైదరాబాద్‌, వెలుగు: విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, దక్కాల్సిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం అలసత్వాన్ని పార్లమెంట్‌ వేదికగా లేవనెత్తాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఆయా సందర్భాలు, అంశాలను బట్టి పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఐఐఎం లాంటి విద్యాసంస్థలు, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు వంటి విభజన హమీలు, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి విజ్జప్తులను ఫాలో అప్ చేయాలని ఎంపీలకు సూచించారు.

పార్టీ వాయిస్​ వినిపించాలి

ఐదేళ్లుగా అనేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసిందని, హైదరాబాద్‌లో జేబీఎస్‌ నుంచి కంటోన్మెంట్‌ మీదుగా రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ శాఖ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా వంటి అంశాలపై ఎంపీలు పనిచేయాలని కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై పార్లమెంట్‌లో పార్టీ వాయిస్‌ను వినిపించాలని సూచించారు. శాఖలవారీగా రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, వినతుల జాబితాను పార్టీ ఎంపీలకు అందిస్తామని, ఢిల్లీలో ఫాలోఅప్ చేసేందుకు సులభం అవుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, నిధులు, కోచ్ ఫ్యాక్టరీ వంటి దీర్ఘకాలిక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. స్టాండింగ్ కమీటీల్లో సభ్యులుగా ఉన్న ఎంపీలు అయా శాఖల్లోని పథకాలు, ప్రయోజనాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలన్నారు.

ఢిల్లీలోనూ పార్టీ ఆఫీసు నిర్మాణం

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, గణాంకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎంపీలకు అందించేందుకు అన్ని హంగులతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే పార్టీకి అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ఉన్నాయని, దేశ రాజధానిలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణ ప్రక్రియను ప్రారంభిస్తామని, ఈ విషయంలో పార్టీ ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తొలిసారి పార్లమెంటరీ పార్టీ మీటింగ్​కు నేతృత్వం వహించిన కేటీఆర్‌కు పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.