మునుగోడులో ఆన్​లైన్​​ ట్రాన్స్​ఫర్​ చేసేందుకు రెడీ అవుతున్న పార్టీలు

మునుగోడులో ఆన్​లైన్​​ ట్రాన్స్​ఫర్​ చేసేందుకు రెడీ అవుతున్న పార్టీలు
  • ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్న టీఆర్ఎస్​
  • ఓటర్ల ఫోన్ నంబర్లతో పాటే బ్యాంక్​ఖాతా నంబర్ల సేకరణ
  • ప్రచారం పేరుతో వివరాలు రాబడుతున్న వార్డు ఇన్​చార్జిలు
  • పోలింగ్​కు ముందు రోజు పేమెంట్​ చేసేలా ప్లాన్​

నల్గొండ, వెలుగు:  మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమం మొదలైంది. నిన్న మొన్నటివరకు మండల, గ్రామస్థాయి లీడర్లకు పైసలు వెదజల్లి వలసలను ప్రోత్సహించిన అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు  ఓటర్ల పై ఫోకస్​పెట్టాయి. హుజూరాబాద్​ ఉప ఎన్నికల్లో ఓటర్లకు నేరుగా డబ్బులు పంచి అభాసుపాలుకావడంతో ఇప్పుడు రూట్​ మార్చాయి.  ఓటర్లందరికీ అకౌంట్లు, చాలామందికి స్మార్ట్​ఫోన్లు ఉండడంతో సడీ సప్పుడు కాకుండా ఆన్​లైన్​పేమెంట్​చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ విషయంలో రూలింగ్​పార్టీ లీడర్లు ముందంజలో ఉన్నారు. ఇంటింటి ప్రచారం పేరుతో ఓ వైపు పాంప్లెంట్స్​ పంచుతూనే మరోవైపు ఓటర్ల వివరాలు, ఫోన్​నంబర్లు, బ్యాంక్​ అకౌంట్​డిటెయిల్స్​ సేకరిస్తున్నారు.

డైరెక్ట్​గా అకౌంట్లలోకే..  

మునుగోడు ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు సీరియస్​గా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్​పేరును బీఆర్​ఎస్​గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న రూలింగ్​పార్టీకి మునుగోడు గెలుపు కీలకంగా మారింది. హుజూరాబాద్​ ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్​, అక్కడ వివిధ పథకాల పేరుతో రూ.5వేల కోట్ల దాకా ఖర్చు పెట్టింది. తీరా పోలింగ్​ముందు అధికార, అపోజిషన్​ పార్టీ లీడర్లు ఓటుకు రూ.3వేల నుంచి రూ.6వేల దాకా పంచి, రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయారు. చాలా చోట్ల డబ్బులు అందని ఓటర్లు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ దృశ్యాలు జాతీయస్థాయి మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో చూసినవాళ్లంతా ముక్కునవేలేసుకున్నారు. అంతకుముందు హుజూర్​నగర్​, సాగర్ ఎన్నికల్లో కొందరు ఓటర్లకు ఫోన్​పే, గుగూల్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ ఫర్​ చేశారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ఈసారి మునుగోడులో పూర్తిస్థాయిలోఅకౌంట్​ చెల్లింపులు చేయాలని పార్టీలు భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఈ విషయంలో రూలింగ్​పార్టీ ఇప్పటికే అకౌంట్​నంబర్లు, ఫోన్​ నంబర్లు సేకరిస్తోంది. పోలింగ్ ఒకటి, రెండు రోజుల​ ముందు ఆయా గ్రామాలు, వార్డులకు చెందిన పార్టీ లీడర్ల ద్వారా ఓటర్ల అకౌంట్లకు ట్రాన్స్​ఫర్​ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఓటుకు ఎంత ఇవ్వాలనేది ఆయా ఏరియాల్లో ఉన్న పోటీని బట్టి, ప్రత్యర్థి ఇచ్చే మొత్తాన్ని బట్టి నిర్ణయిస్తారని ఓ లీడర్​చెప్పడం గమనార్హం.

అన్ని డిటెయిల్స్​ రాబడ్తున్నరు.. 

రూలింగ్​ పార్టీకి చెందిన వార్డు ఇన్​చార్జిలు దసరా తర్వాత గ్రామాల్లో ఇంటింటి ప్రచారం స్పీడప్​ చేశారు.  చేతిలో పాంప్లెంట్స్​తో  ఒక్కో ఇంటికి ఇద్దరు నుంచి ముగ్గురు వెళ్లి టీఆర్ఎస్​కు ఓటెయ్యాలని చెప్తూనే పనిలో పనిగా ఓటర్లకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లో ఉన్న మొత్తం ఓటర్లు, వాళ్ల పేర్లు, ఫోన్​నంబర్లు, బ్యాంక్​ అకౌంట్​డిటెయిల్స్​ అడుగుతున్నారు. పేర్లు, ఫోన్​నంబర్లు సరేగానీ, అకౌంట్ డిటెయిల్స్​ ఎందుకు అడుగుతున్నారో తెలియక ఓటర్లు పరేషాన్​ అవుతున్నారు. కొందరైతే మీరు గవర్నమెంటోళ్లు కాదు కదా, పార్టీవోళ్లకు ఇవన్నీ ఎందుకు? అని అడిగితే పోలింగ్​ ముందు మీకే తెలుస్తది అంటూ తప్పించుకుంటున్నారు. పైసలు వేస్తామని ఇప్పుడే చెప్తే విషయం లీకై, ప్రత్యర్థి పార్టీలు, ఎలక్షన్​ ఆఫీసర్ల నుంచి తలనొప్పి ఉంటుందనే దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఫోన్​నంబర్లు, అకౌంట్​ డిటెయిల్స్​తో పాటు ఆయా ఓటర్లు ఏ పార్టీకి ఓటేసే అవకాశముందో కూడా వార్డు ఇన్​చార్జిలు తెలుసుకుంటున్నారు. ఇందుకోసం అక్కడి లోకల్​ పార్టీ లీడర్లపై ఆధారపడ్తున్నారు. ప్రస్తుతం ఒక్కో వార్డు ఇన్​చార్జి పరిధిలో 100 మంది ఓటర్లు ఉండగా, ఆ 100 మందిలో టీఆర్​ఎస్​కు, బీజేపీకి, కాంగ్రెస్​కు, ఇతర పార్టీలకు ఎన్ని ఓట్లు పడ్తాయో, న్యూట్రల్​గా ఉండేవాళ్లెందరో వివరాలు సేకరించి, ఎంపీటీసీ స్థానాలకు ఇన్​చార్జిలుగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు పంపిస్తున్నారు. ఈ లిస్టుల ద్వారా తమకు పడబోయే ఓట్లపై ఎమ్మెల్యేలు, మంత్రులు ఓ అంచనాకు వచ్చి, ఆ సంఖ్యను పెంచేందుకు ఏం చేయాలో వ్యూహం రచిస్తున్నారు.