వామ్మో.. వాళ్లంత ఖర్చు పెట్టలేం

వామ్మో.. వాళ్లంత ఖర్చు పెట్టలేం

(వెలుగు నెట్వర్క్మున్సిపల్  ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారపార్టీ క్యాండిడేట్లు ఒక్కో వార్డులో రూ.20 లక్షల నుంచి 50 లక్షల దాకా ఖర్చు చేసేందుకు రెడీ అయ్యారు. ఆ స్థాయిలో ఖర్చు పెట్టగలిగేవారికే టికెట్లు ఇస్తున్నారు. ఆ పార్టీ నుంచి రియల్టర్లు, లిక్కర్, మైనింగ్​ వ్యాపారుల వంటివారు ఎక్కువగా బరిలో నిలుస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది చూసి బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీల లీడర్లు జంకుతున్నారు. లక్షలకు లక్షలు తాము ఖర్చుపెట్టలేమని ఆందోళన చెందుతున్నారు. దీంతో పోటీపై కొందరు లీడర్లు ముందే చేతులెత్తేస్తుండగా.. మరికొందరు ఓడిపోతామన్న పరిస్థితి ఉన్నా రాజకీయ ఉనికి కోసం బరిలోకి దిగుతున్నారు.

ఎట్లాగైనా గెలవాలె..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జరుగుతున్న ప్రతి ఎన్నికనూ టీఆర్ఎస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ‘ఎలాగైనా గెలిచి తీరాలి..’ అన్న సంకేతాలను హైకమాండ్​ ఒక ప్లాన్​ ప్రకారం పార్టీ శ్రేణుల్లోకి పంపిస్తోంది. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికలే కాదు.. పరిషత్, పంచాయతీల్లోనూ టీఆర్ఎస్​ ఇదే తరహా మైండ్​గేమ్  ఆడింది. ఇప్పుడు మున్సిపాలిటీలన్నింటినీ గెలుచుకొని రావాలంటూ ఎమ్మెల్యేలకు టార్గెట్​పెట్టిన సీఎం కేసీఆర్.. ‘ఓడిపోతే పదవులుండయ్’ అని స్వయంగా మినిస్టర్లను హెచ్చరించారు. దీంతో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు భారీగా డబ్బు ఖర్చు పెట్టగలిగే వారికే టికెట్లు ఇస్తున్నారు.

రంగంలోకి రియల్టర్లు, లిక్కర్, మైనింగ్  మాఫియా! 

రియల్టర్లు, మద్యం వ్యాపారులు, ఇసుక, గ్రానైట్, ఇతర మైనింగ్​ మాఫియా​లీడర్లు తమ వ్యాపార అవసరాల కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతున్నారు. పాలిటిక్స్​లో యాక్టివ్​గా లేనివారు కూడా ఎన్నికల్లో నిలిచే అధికార పార్టీ లీడర్లకు ఆర్థికంగా సపోర్ట్​ చేస్తున్నారు. ఎన్నికల ముందు లక్షలకు లక్షలు సర్దుబాటు చేసి, గెలిచాక వ్యవహారాలను చక్కబెట్టుకుంటున్నారు. ఇట్లా తమకు సహకరించే మైనింగ్, రియల్, లిక్కర్​ మాఫియా లీడర్లపై ఈగ వాలకుండా రాజకీయ నాయకులు చూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్​లో అధికార పార్టీకి చెందిన ఓ ప్రముఖ ప్రజాప్రతినిధికి ఓ లిక్కర్ వ్యాపారి ఫోన్​చేసి.. ఆదిలాబాద్​ బస్టాండ్​ ప్రాంతానికి చెందిన ఓ కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఎన్నికల ముందు ఎంతో సాయం చేశామని, టికెట్  ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. ఆ ప్రజాప్రతినిధి ఈ విషయాన్ని తన సన్నిహితులకు చెప్పుకున్నాడు. ఇది కాస్తా మీడియాకు లీకై, రాజకీయవర్గాల్లో హాట్​టాపిక్​లా మారింది. మొత్తంగా సదరు లిక్కర్​ వ్యాపారి చెప్పినవారికే గురువారం టీఆర్ఎస్​ టికెట్​ దక్కడం గమనార్హం.

చాలాచోట్ల కాంగ్రెస్, బీజేపీకి క్యాండిడేట్లు కరువు

అసెంబ్లీ, లోక్​సభ, పరిషత్​ ఎలక్షన్ల అనుభవాలు కొందరు కాంగ్రెస్, బీజేపీ లీడర్లను వెంటాడుతున్నాయి. ఇప్పుడు మున్సిపల్​ ఎన్నికల్లో రిజర్వేషన్లు, క్యాండిడేట్లతో సంబంధం లేకుండా అధికార పార్టీ లీడర్లు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం కావడంతో ఇతర పార్టీల లీడర్లు పోటీకి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు కరీంనగర్​ కార్పొరేషన్​ను గ్రానైట్​ మాఫియా శాసిస్తోంది. ఇక్కడ ఒక్కో డివిజన్​ పరిధిలో రూ.50 లక్షలు కూడా పెట్టేందుకు టీఆర్ఎస్​ క్యాండిడేట్లు రెడీ అయ్యారు. అయితే కరీంనగర్​ ఎంపీగా బండి సంజయ్​ గెలవడంతో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. కానీ కాంగ్రెస్​కు మాత్రం చాలా డివిజన్లలో క్యాండిడేట్లు కరువయ్యారు. హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్​ నుంచి పోటీకి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు.

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లా నిర్మల్, మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్​ క్యాండిడేట్లకు దీటుగా ఖర్చుపెట్టే వాళ్ల కోసం కాంగ్రెస్, బీజేపీ ఇంకా వెతుకుతూనే ఉన్నాయి. మంచిర్యాల కాంగ్రెస్​కు ప్రేమ్​సాగర్​రావు దన్ను గా ఉండడంతో అక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

సీఎం కేసీఆర్​ ఇలాకాగా భావించే ఉమ్మడి మెదక్​ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మెదక్ లో 32 వార్డులు ఉండగా.. 20 చోట్ల కాంగ్రెస్, బీజేపీలకు బలమైన అభ్యర్థులు దొరకడం లేదు.

మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, భూత్పూర్, కొల్లాపూర్, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, పెబ్బేరు​ మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్​కు క్యాండిడేట్ల కొరత కనిపిస్తోంది.

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్​ అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్నారు. సూర్యాపేటలో బీజేపీ 6 నుంచి 8 వార్డులకు మించి పోటీచేసే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్​ మధ్య పోటీ కనిపిస్తోంది.

రియల్ ఎస్టేట్​ జోరుగా ఉన్న సంగారెడ్డి లాంటి జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్​కు దీటుగా కాంగ్రెస్, బీజేపీల నుంచి క్యాండిడేట్లు బరిలోకి
దిగుతున్నారు. అక్కడి ఏడు మున్సిపాలిటీల పరిధిలో డబ్బు వరదలా పారే అవకాశం కనిపిస్తోంది.