
- వరద సాయం, డబుల్ ఇండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆందోళన
- ముందుగానే హౌస్ అరెస్టులు
- ఎంజీఎం జంక్షన్లో నేతల మెరుపు నిరసన
- పోలీసులు, లీడర్ల మధ్య వాగ్వాదం..తోపులాట
వరంగల్, వెలుగు: వరద బాధితులకు ఆర్థిక సాయం, సిటీలోని పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇచ్చిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ముట్టడి, ధర్నా సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కార్పొరేషన్ ముందు ధర్నాకు పార్టీ నేతలు పిలుపునివ్వగా పోలీసులు అనుమతి నిరాకరించారు. కార్పొరేషన్ వైపు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి మెయిన్ రోడ్లను బారికేడ్లతో మూసేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మురళి దంపతులతో పాటు లీడర్లను హౌజ్ అరెస్ట్చేశారు.
పోలీసుల కళ్లుగప్పి ఎంజీఎం జంక్షన్‍కు..
ధర్నాను అడ్డుకోవడానికి ఐదారుగురు ఏసీపీలు, పదుల సంఖ్యలో సీఐలు, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, వందలాది మంది కానిస్టేబుల్స్ కార్పొరేషన్ చుట్టూ ఉన్న ఏరియాలను ఆధీనంలోకి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి పోలీసుల కళ్లుగప్పి ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి ఆర్టీసీ బస్సులో కార్పొరేషన్ దగ్గరుండే ఎంజీఎం జంక్షన్ చేరుకున్నారు. మరికొందరు పార్టీ లీడర్లతో పాటు యువజన కాంగ్రెస్ నుంచి తోట పవన్, అలువాల కార్తీక్, మహిళా విభాగం నుంచి కూచన రవళి, బంక సరళ వివిధ ప్రాంతాల నుంచి పోలీసు వలయాన్ని తప్పించుకుని చేరుకున్నారు. బారికేడ్లను దాటి బల్దియా వైపు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు రాజేందర్ రెడ్డిని తరలించడానికి వాహనం ఎక్కించగా కార్యకర్తలు వ్యాన్‍కు అడ్డుపడ్డారు.
దీంతో పోలీసులు వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్లలో పడేశారు. నాయినితో పాటు మిగతా లీడర్లను కాజీపేటలోని మడికొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు చేసిన నాలాలు, భూకబ్జాలతోనే హనుమకొండ, వరంగల్ సిటీలో వరదలొచ్చి కాలనీలు మునిగాయన్నారు. గతంలో వరదలు వచ్చినప్పుడు మంత్రి కేటీఆర్ చెప్పిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు. వరద బాధితులకు ఆర్థిక సాయం, సిటీ జనాలకు డబుల్ బెడ్‍రూంల కోసం పోరాడుతుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల గొంతు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు.
రిటైర్డ్ పోలీస్ కమిషనర్నే గుంజి పడేసిన్రు
కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరిన నిజామాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తన అనుచరులతో కార్పొరేషన్ వైపు దూసుకొచ్చారు. నాగరాజు జిల్లాలో పని చేసినప్పుడు సెల్యూట్ కొట్టిన పోలీస్ అధికారులు, సిబ్బంది సోమవారం మాత్రం ఆయనను నెట్టివేస్తూ పోలీస్ వాహనం ఎక్కించారు. ఏసీపీ బోనాల కిషన్ స్వయంగా ఆయనను గుంజిపడేశారు.