
నిజామాబాద్ నగరంలో ప్రారంభించిన సిటీ బస్సుల్లో ప్రయాణీకులు ఎక్కట్లేదు. టీఎస్ఆర్టీసీ అధికారుల ప్రచారం లోపం, ఏయే బస్సులు ఏ రూట్లలో వెళ్తాయో తెలియక పోవడంతో ప్రయాణీకులు ప్రైవేట్ వెహికిల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇకనైనా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి..పరిష్కరిస్తే సిటీ బస్సులకు ఆదరణ పెరుగుతుందంటున్నారు పబ్లిక్. ఈ నెల 11న నిజామాబాద్ నగరంలో సిటీ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే గణేశ్ గుప్తా. నాగారం 300 క్వార్టర్స్ నుంచి కొత్త కలెక్టరేట్...డైరీ ఫారం నుంచి మాధవ నగర్ వరకు..రెండు రూట్లలో 6 బస్సులను నడుపుతున్నారు. కనీస టికెట్ ధర 10 రూపాయల నుంచి అత్యధికంగా 20 రూపాయల వరకు ఉంది. అయితే టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నా సరైన ప్రచారం లేకపోవడంతో సిటీ బస్సులు ఆదరణకు నోచుకోవడం లేదు.
బస్సులు మొదలై 2 వారాలు గడుస్తున్నా... ఇప్పటికీ బస్సుల్లో పూర్తి స్థాయిలో ప్రయాణీకులు ఎక్కడం లేదు. ప్రస్తుతం నడుస్తోన్న ఒక్కో బస్సుల్లో 32 సీట్లు ఉండగా... పది పన్నెండు సీట్లు మాత్రమే నిండుతున్నాయి. రెగ్యులర్ బస్సుల్లా అరగంట లేదా గంటకు కాకుండా నాన్ స్టాప్ గా సిటీ బస్సులను నడపాలంటున్నారు పబ్లిక్. స్టాపులను, బస్సుల టైమింగ్స్ ను పబ్లిక్ కు అందుబాటులో ఉంచాలంటున్నారు.
సిటీ బస్సులు నడుస్తున్న రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో... ప్రయాణాలు లేట్ అవుతున్నాయి. డైరీ ఫారం నుంచి మాధవ నగర్ వెళ్లే బస్సును.... రోడ్లు ఇరుకుగా ఉండే దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్, కోర్టు చౌరస్తా, వీక్లీ మార్కెట్ -నిఖిల్ సాయి చౌరస్థా మీదుగా పులాంగ్ వైపు నడుపుతున్నారు. కానీ నేరుగా బస్టాండ్ కు వెళ్లి అక్కడి నుంచి మాధవనగర్ కు పంపితే జర్నీ మరింత ఈజీ అవుతుందని చెప్తున్నారు పబ్లిక్. 300 క్వార్టర్స్ కొత్త కలెక్టరేట్ కు వెళ్లే బస్సులను కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పెద్దబజార్, దేవీరోడ్ మీదుగా దుబ్బ వైపు మళ్లించారు. ఇలా కాకుండా ప్రధాన దారులలో బస్సులు నడపడంతో ప్రయాణికులు ఎక్కేందుకు ఈజీగా ఉంటుంది. మరో రూట్ లో నడుస్తున్న నాగారం 300 క్వార్టర్స్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నడుపుతున్న బస్సును మాణిక్ భండార్ వరకు నడిపితే బాగుంటుందంటున్నారు ప్రయాణికులు.
బస్సులకు పెట్టిన పేర్లు కూడా గుర్తించేందుకు ఇబ్బందిగా ఉందంటున్నారు ప్రయాణీకులు. 300 క్వార్టర్స్ కు బదులు నాగారం నుంచి కొత్త కలెక్టరేట్ అని...డైరీ ఫారం అని కాకుండా సారంగా పూర్ నుంచి మాధవ పూర్ అని మార్చితే బాగుంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతీ బస్సు నిజామాబాద్ మెయిన్ బస్టాండ్ లో ఆగి వెళ్లడంతో ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు. పబ్లిక్ నుంచి వస్తున్న రెక్వెస్ట్ లను పరిగణలోకి తీసుకొని..చర్యలు తీసుకుంటామంటున్నారు ఆర్టీసీ రీజినల్ మేనేజర్. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అధికారులు గుర్తించాలంటున్నారు పబ్లిక్. లోపాలను సరిదిద్ది.. అవసరమైన చర్యలు తీసుకుంటే సిటీ బస్సులకు కచ్చితంగా ఆదరణ ఉంటుందంటున్నారు పబ్లిక్.
మరిన్ని వార్తల కోసం : -
కాంగ్రెస్ పై నగ్మా అసంతృప్తి
పుణె డిఫెన్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్