బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు..బస్టాండుల్లో జనం తిప్పలు

బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు..బస్టాండుల్లో జనం తిప్పలు

సంక్రాంతి పండగకు సొంతూరుకు వచ్చి..తిరిగి గమ్యస్థానాలకు చేరుకునే  ప్రయాణికులు బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడంతో పాటు పలు  బస్ స్టాండ్ లలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. డిపోల్లోని బస్సుల్లో దాదాపు అధిక శాతం ఖమ్మం బీఆర్ఎస్ సభకు వెళ్తుండటంతో..ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న కొన్ని బస్సులు జనంతో కిక్కిరిపోతున్నాయి. కనీసం నిలబడేందుకు కూడా చోటు లేని పరిస్థితి నెలకొంది.  జగిత్యాల జిల్లా కోరుట్ల బస్ డిపోలో మొత్తం 39 బస్సులు ఉంటే అందులో 15 బస్సులు బీఆర్ఎస్ సభ కోసం కేటాయించడం గమనార్హం.

మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడం బస్ స్టేషన్ లోనూ ఇదే పరిస్థితి.  బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి  పడిగాపులు కాస్తున్నారు. వరంగల్, మహబూబాబాద్,సూర్యాపేట, ఖమ్మం వెళ్లేందుకు బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే బస్సులు బీఆర్ఎస్ సభ కోసం కేటాయించడంతో..జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

కోరుట్ల బస్టాండ్కు ఉదయం 8 గంటలకు వచ్చాను. ప్రయాణికులతో బస్టాండ్ నిండి ఉంది. నిజామాబాద్కు వెళ్లేందుకు బస్సులు లేవు. పండగ కోసం వచ్చిన వారంతా తిరిగి వారి ఊర్లకు వెళ్లేందుకు వస్తున్నారు. బస్సులు సమయ పాలన పాటిస్తే బాగుంటుంది. బస్సులు లేకపోవడం వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు.  మంత్రులు, ముఖ్యమంత్రుల సభలకు బస్సుల తరలింపు కరెక్ట్ కాదు..బస్సుల్లో నిలబడేందుకు కూడా చోటు లేని పరిస్థితి... ప్రయాణికుడు, కోరుట్ల బస్టాండ్

బీఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత  సీఎం కేసీఆర్ మొదటి సారిగా  ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలువురు జాతీయ నేతలు, ముగ్గురు ముఖ్యమంత్రులు రానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌ హాజరు కానున్నారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ  సభకు ఆర్టీసీ బస్సుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ  జన సమీకరణ చేస్తోంది.