ఒమిక్రాన్‌ వేరియంట్ ఎఫెక్ట్: విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్

ఒమిక్రాన్‌ వేరియంట్ ఎఫెక్ట్: విదేశీ ప్రయాణికులకు క్వారంటైన్

ఆఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించిన నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. కొన్ని దేశాలు సౌతాఫ్రికా సహా ఈ వైరస్ ప్రభావం ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ పెట్టేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇవాళ రెండు గంటల పాటు రివ్యూ నిర్వహించి.. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వాలనూ అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ క్రమంలో ముంబై మేయర్‌‌ కిశోరీ పండేకర్‌‌ ముందస్తు చర్యలను ప్రకటించారు. సౌతాఫ్రికా నుంచి ముంబై వచ్చే ప్రతి ఒక్కరికీ ఎయిర్‌‌పోర్టులోనే టెస్టులు చేయాలని, వారి క్వారంటైన్‌లో పెట్టాలని ఆదేశించారు.

కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ నేపథ్యంలో దీని వ్యాప్తి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కిశోరీ పండేకర్ చెప్పారు. సౌతాఫ్రికా నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ టెస్టులు చేసి క్వారంటైన్‌లో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడం ద్వారా ఎవరైనా ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారో లేదో చెక్ చేస్తామని వెల్లడించారు. త్వరలో క్రిస్మస్ రాబోతోందని, ఈ పండుగ సందర్భంగా మహారాష్ట్ర, ముంబైల్లో ఉన్న తమ కుటుంబాలను కలుసుకునేందుకు ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. అనేక దేశాలను ఈ కొత్త వేరియంట్ ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందని పండేకర్ తెలిపారు. మాస్క్ పెట్టుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం లాంటి జాగ్రత్తల విషయంలో ఎవరూ అలసత్వం ప్రదర్శించొద్దని కోరారు.