బస్సు చార్జీలు పెరిగాక తగ్గిపోయిన ప్యాసింజర్లు

బస్సు చార్జీలు పెరిగాక తగ్గిపోయిన ప్యాసింజర్లు
  • ఆక్యుపెన్సీ పడిపోతున్న రూట్లలోనే ఎక్కువ సర్వీసులు
  • రిక్వెస్టులు వచ్చిన ప్రాంతాలను పట్టించుకోని డిపో మేనేజర్లు

మెహిదీపట్నం నుంచి ఉప్పల్(రూట్ నంబర్ 300) వైపు ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంది. సాయంత్రం టైంలో ఈ రూట్​లో అంతగా డిమాండ్​ఉండడం లేదు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు బస్సులు ఖాళీగానే తిరుగుతున్నాయి. ఒక్కోసారి కనీసం ఒక్క ప్యాసింజర్​కూడా ఉండట్లేదు. అదే మెహిదీపట్నం నుంచి వెళ్లే రూట్​నంబర్ 288లో సన్ సిటీ, మొయినాబాద్ ప్రాంతాలకు, మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే రూట్​నంబర్ 188లో ఆర్టీసీ బస్సులకు ఎక్కువ డిమాండ్​ ఉంది. కానీ అధికారులు బస్సులు తిప్పడం లేదు.

రూట్ నంబర్ 281లో ఘట్ కేసర్ నుంచి ఈసీఐఎల్, సికింద్రాబాదు వైపు ఆర్టీసీ బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఈ  రూట్ లో అధికారులు బస్సులు పెంచడం లేదు. ఆక్యుపెన్సీ లేనిచోట తగ్గించి ఈ రూట్ లో పెంచితే ఆర్టీసీకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 
 

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలోని డిమాండ్​ఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రూట్​లలో బస్సులు ఖాళీగా తిరుగుతున్నా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. డిమాండ్​ను గుర్తించి ఎప్పటికప్పుడు సర్వీసుల రీ షెడ్యూలింగ్ చేస్తే సమస్య ఉండదు. ప్రతి రూట్ పై ఫోకస్ పెడుతున్నామని అధికారులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకోలా ఉంది. దీనికితోడు మెట్రో రైల్ అందుబాటులో ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సులకు ఆదరణ తగ్గిపోయింది. 

ఆర్టీసీ అధికారులు బస్​చార్జీలు పెంచినప్పటి నుంచి చాలావరకు మెట్రోలో వెళ్లేందుకే జనం ఆసక్తి చూపిస్తున్నారు. మెట్రో, బస్​చార్జీలు దాదాపు ఒకేలా ఉండడమే ఇందుకు కారణం. మెట్రో రైళ్లలో రోజూ 3 లక్షల మందికి పైగా జర్నీ చేస్తున్నారు. మెట్రో రూట్లలో బస్సుల సంఖ్యను తగ్గించి లేని ఏరియాల్లో పెంచితే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పఠాన్ చెరు నుంచి కోఠి వరకు రూట్ నంబర్​218లో మియాపూర్​నుంచి మెట్రో రైలు అందుబాటులో ఉంది. దీంతో జనం చాలావరకు మెట్రో ఎక్కుతున్నారు. అలాగే 113కేఎల్ లింగంపల్లి నుంచి ఉప్పల్ రూట్ లోనూ ఇదే పరిస్థితి. కాగా పఠాన్ చెరు నుంచి సికింద్రాబాద్ రూట్ నంబర్​219లో ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఉంది. బస్సుల సంఖ్య పెంచాలని జనం కోరుతున్నారు.

ప్రైవేట్​ వెహికల్సే దిక్కు

గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ 29 డిపోలు ఉన్నాయి. వీటి నుంచి డైలీ 2,900 ఆర్టీసీ బస్సులు 3 వేల రూట్లలో 32 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. దాదాపుగా 15 లక్షల మంది ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా లాక్​డౌన్​తర్వాత బస్సులకు డిమాండ్ ఉన్న రూట్లపై  అధికారులు దృష్టి పెట్టడం లేదు. కొన్ని రూట్లలో మరిన్ని బస్సులు తిప్పాలంటూ డిపో మేనేజర్లకు విజ్ఞప్తులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కరోనాకు ముందు నడిచి చాలా రూట్లలో ప్రస్తుతం బస్సులు తిప్పడం లేదు. 

230ఎన్ సికింద్రాబాద్ నుంచి నాగులూరు, దుండిగల్, 230టీ సికింద్రాబాద్ నుంచి  దుండిగల్ తండా, 230 బీ సికింద్రాబాద్ నుంచి బౌరంపేట, 445 మెహిదీపట్నం నుంచి కేతిరెడ్డిపల్లి వెళ్లే నైట్ ఆల్ట్, 284 కోఠి నుంచి కాచబోయిన సింగారం, ప్రతాపసింగారం, 115 మేడిపల్లి నుంచి పర్వతాపురం ఇలా 300లకుపైగా రూట్లలో బస్సులు తిరగడంలేదు. శివారు ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేవారు ప్రైవేట్ వాహనాలనే నమ్ముకుంటున్నారు. కూరగాయలు, పాలు తీసుకొచ్చేందుకు డైలీ రూ.1500 నుంచి  రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని చిరువ్యాపారులు వాపోతున్నారు. నైట్​ఆల్ట్​బస్సులు ఎత్తేశాక కష్టాలు పెరిగాయని చెబుతున్నారు. 
డిమాండ్ ఉన్నచోట నడపాలె
రోజూ నేను ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తాను. సన్ సిటీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మెహిదీపట్నం వరకు బాగానే ఉంటుంది. అక్కడి నుంచి 113ఐఎం బస్సు కోసం చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది. రాత్రి 8 గంటల తర్వాత మెహిదీపట్నం నుంచి సన్ సిటీ వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. అధికారులు పట్టించుకోవాలి. ‌- ప్రభాకర్, ప్రయాణికుడు 
రీషెడ్యూలింగ్ చేస్తున్నం
అన్ని రూట్లపై ఫోకస్​పెట్టాం. రీషెడ్యూలింగ్ చేస్తున్నం. డిమాండ్ ఉన్న రూట్లలో మరిన్ని ట్రిప్పులు తిప్పుతున్నం. డీఎంలతో ఎప్పటికప్పడు మాట్లాడుతున్నాం. కండెక్టర్,  డ్రైవర్ల నుంచి కూడా వివరాలు తెలుసుకుంటున్నం. ఎక్కడైనా అవసరం ఉందని తమ దృష్టికి వస్తే తప్పనిసరిగా బస్సులు తిప్పుతం. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూస్తం. - యాదగిరి, గ్రేటర్​ఆర్టీసీ ఈడీ