
బెంగళూరు: బెంగళూరులో మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు చేదు వార్త. ‘నమ్మ మెట్రో’ టికెట్ ధరలు మరోసారి పెంచుకునే దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) నిర్ణయం తీసుకుంది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా.. ప్రతీ సంవత్సరం మెట్రో టికెట్ ధరలను 5 శాతం పెంచాలని BMRCL నిర్ణయించింది. ఫిబ్రవరి 2026 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే బెంగళూరులో మెట్రో టికెట్ ధరలు దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే మోతపుడుతున్నాయి.
2025, ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మెట్రో టికెట్ ధరలను దాదాపు 50 శాతం పెంచిన సంగతి తెలిసిందే. 0-2 కి.మీ: రూ. 10, 2-4 కి.మీ: రూ. 20, 4-6 కి.మీ: రూ. 30, 6-8 కి.మీ: రూ. 40, 8-10 కి.మీ: రూ. 50, 10-12 కి.మీ: రూ. 60, 15-20 కి.మీ: రూ. 70, 20-25 కి.మీ: రూ. 80, 25-30 కి.మీ, అంతకంటే ఎక్కువ దూరానికి బెంగళూరు మెట్రో టికెట్ ధర ప్రస్తుతం 90 రూపాయలుగా ఉంది.
కర్నాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ఛార్జీలను 15 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ టికెట్ ధరల పెంపుతో ప్రయాణికులు దానికి ప్రత్యామ్నాయంగా మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో టికెట్ ధరలను కూడా పెంచడంపై ఇప్పటికే ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని తట్టుకోలేక మెట్రోను ఆశ్రయిస్తుంటే.. ఇక్కడ కూడా చార్జీల పెంపు పేరుతో సామాన్యులపై భారం మోపడం సరికాదంటున్నారు. అలాంటిది.. 2026 ఫిబ్రవరిలో బెంగళూరు సిటీలో మరోసారి మెట్రో టికెట్ ధరలు 5 శాతం పెంచే నిర్ణయం తీసుకున్నారనే వార్తలు మెట్రో ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి.