కవితతో విష్ణు భేటీ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్..!

కవితతో విష్ణు భేటీ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్..!

=జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్
= పెద్దమ్మ ఉత్సవాలకు ఆహ్వానించానన్న మాజీ ఎమ్మెల్యే
= 2009లో జూబ్లీ  హిల్స్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విష్ణు
= ప్రస్తుతం మాగంటి సునీతకే బీఆర్ఎస్ టికెట్!
= బయటికి వచ్చి తాను కేటీఆర్ వెంటే ఉంటానన్న విష్ణువర్ధన్ రెడ్డి

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, దివంగత కార్మిక శాఖ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్  రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వీళ్లిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.  పీజేఆర్ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ నుంచి 2008లో నిర్వహించిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2009లో జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.  

2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన విష్ణు ఓటమి చెందారు. అప్పుడు దివంగత గోపీనాథ్ బీఆర్ఎస్ తరఫున విజయం  సాధించారు.  2023 అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‎కు రాజీనామా చేసి కేసీఆర్‎ను కలిసి బీఆర్ఎస్‎లో చేరారు. బీఆర్ఎస్ లో చేరినప్పటికీ  రాజకీయంగా మాత్రం అంత చురుకుగా ఉండటం లేదు. 

మాగంటి మరణంతో జూబ్లీహిల్స్‎లో ఉప ఎన్నికలు రావడంతో బీఆర్ఎస్‎లో కొనసాగుతున్న విష్ణును కవిత కలుసుకోవడం ఆసక్తిగా మారింది. వీళ్లిద్దరి మధ్య ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. మీటింగ్ తర్వాత బయటికి వచ్చిన విష్ణు మీడియాతో మాట్లాడారు. తాను కేటీఆర్ వెంటే ఉంటానని, పెద్దమ్మ ఉత్సవాలకు ఆహ్వానించేందుకు మాత్రమే కవిత ఇంటికి వెళ్లినట్టు చెబుతున్నారు. అనంతరం జరిగిన వెంగళరావ్ నగర్ డివిజన్ సమావేశంలోనూ విష్ణు పాల్గొన్నారు.