Asia Cup 2025: మీ చేత్తో ఆసియా కప్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము: సూర్యకుమార్ యాదవ్

Asia Cup 2025: మీ చేత్తో ఆసియా కప్ ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేము: సూర్యకుమార్ యాదవ్

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఆసియా కప్ లో హీట్ కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం (సెప్టెంబర్ 15) జరిగిన లీగ్ మ్యాచ్ లో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా టీమిండియా తమ హుందాతనాన్ని చాటుకుంది. దాయాధి జట్టును లెక్క చేయకుండా షెబాష్ అనిపించుకుంది. ఫార్మాలిటీగానే మ్యాచ్ ఆడామని బహిరంగంగానే చెప్పింది. మ్యాచ్ లో గ్రాండ్ విజయం సాధించడమే కాకుండా పాకిస్థాన్ కు ఘోర అవమానాన్ని మిగిల్చింది. ఈ హీట్ చల్లారకుండానే పాకిస్థాన్ కు టీమిండియా మరో షాక్ ఇచ్చింది. 

టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాకిస్థాన్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుని టోర్నమెంట్ గెలిస్తే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టోర్నీని అందుకోకూడదని సూర్య భావిస్తున్నట్టు సమాచారం. ఫైనల్లో ప్రెజెంటేషన్ వేదికను పంచుకోకూడదని సూర్య నిర్ణయించుకున్నట్టు వస్తున్న వార్తలు బయట పడ్డాయి. ఈ కాంటినెంటల్ టోర్నీ సెప్టెంబర్ 28న జరగనుంది. టీమిండియా అయినా సూపర్ ఫామ్ కు కప్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ప్రస్తుతం ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా. టోర్నీ గెలిచిన జట్టుకు అతనే ట్రోఫీ అందించనున్నాడు. టీమిండియా వద్దనుకుంటే మరి ఫైనల్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో పాకిస్థాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా టీమ్ పై ఉన్న కోపాన్ని మ్యాచ్ రిఫరీ పై చూపించింది.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ.. " ఐసీసీ ప్రవర్తనా నియమావళి, క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన MCC చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని వెంటనే తొలగించాలని పీసీబీ  డిమాండ్ చేసింది". అని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలపడం టీమిండియాకు నచ్చలేదు. ఆసియా కప్ చైర్మన్ గా ఉంటూ పాకిస్థాన్ కు సపోర్ట్ చేయడాన్ని నెటిజన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు.